ఆన్లైన్ ఉమెన్ ఇన్ఫ్లుయెన్సర్ను కలిసేందుకు వెళ్లిన యువకుడు.. కొట్టి చంపేసిన వైనం.. ఎక్కడ?
ఆన్లైన్లో పరిచయమైన ఉమెన్ ఇన్ఫ్లుయెన్సర్ను కలిసేందుు వెళ్లిన ఓ యువకుడు ప్రాణాలు కోల్పోయాడు. సోషల్ మీడియాలో పరిచయం, ఆ తర్వాత యువతిపై వ్యామోహం కారణంగా ఆ యువకుడు తన ప్రాణాలను కోల్పోయాడు. తనకు పరిచయమైన ఇన్ఫ్లుయెన్సర్ను కలిసేందుకు వెళితే, యువకుడు బంధువులు పట్టుకుని కట్టేసి తీవ్రంగా కొట్టారు. దీంతో ఆ యువకుడు తీవ్రంగా గాయపడి మృతి చెందాడు. ఈ దారుణం తూర్పు ఢిల్లీ పరిధిలోని మధు విహార్‌లో చోటుచేసుకుంది.
తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, చెన్నైలోని ఓ ప్రైవేట్ సంస్థలో పనిచేస్తున్న ఓ యువకుడు, వివిధ సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌లలో 29 లక్షల మందికి పైగా సబ్స్క్రైబర్లను ఉన్న ఓ మహిళా ఇన్ఫ్లెయెన్సర్ కంటెంట్‌ను నిత్యం అనుసరించేవాడు. ఆ క్రమంలోనే ఆమెపై ఏకపక్షంగా ఇష్టం పెంచుకున్నాడు. ఎలాగైనా ఆమెను కలవాలనే ఉద్దేశంతో నవంబరు 7న చెన్నై నుంచి ఢిల్లీలోని మధు విహార్ ప్రాంతంలో ఉన్న ఆమె ఇంటికి చేరుకున్నాడు.
ఆమె ఇంట్లోకి ప్రవేశించేందుకు ప్రయత్నించడంతో తీవ్ర వాగ్వాదం చెలరేగింది. దీంతో ఆగ్రహానికి గురైన ఆ యువతి తండ్రితో పాటు కొందరు స్థానికులు అతడిని పట్టుకుని తీవ్రంగా కొట్టారు. ఈ దాడిలో అతడికి తీవ్ర గాయాలయ్యాయి. దాంతో అతడిని తొలుత లాల్ బహదూర్ శాస్త్రి ఆసుపత్రికి తరలించారు. పరిస్థితి విషమించడంతో గురు తేజ్ బహదూర్ ఆసుపత్రికి, ఆపై మెరుగైన వైద్యం కోసం మరో ఆసుపత్రికి తరలించినప్పటికీ, చికిత్స పొందుతూ అతడు ప్రాణాలు విడిచాడు.
ఈ ఘటనపై సమాచారం అందుకున్న ఢిల్లీ పోలీసులు కేసు నమోదు చేశారు. దాడికి పాల్పడిన యువతి తండ్రితో పాటు మరో పొరుగింటి వ్యక్తిని పోలీసులు ఇప్పటికే అరెస్టు చేశారు. ఈ దాడిలో యువతి సోదరుడితో పాటు మరికొందరు స్థానికుల ప్రమేయం ఉన్నట్లు పోలీసుల ప్రాథమిక దర్యాప్తులో తేలింది. మిగిలిన నిందితులను గుర్తించేందుకు ఆ ప్రాంతంలోని సీసీటీవీ కెమెరా ఫుటేజీలను ప్రత్యేక బృందాలు క్షుణ్ణంగా పరిశీలిస్తున్నాయి.

