'కర్మ హిట్స్ బ్యాక్' : జూబ్లీహిల్స్ ఫలితాలపై కవిత కామెంట్స్
హైదరాబాద్ నగరంలోని జూబ్లీహిల్స్ అసెంబ్లీ నియోజకవర్గం ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి నవీన్ యాదవ్ ఘన విజయం సాధించారు. భారత రాష్ట్ర సమితి అభ్యర్థి మాగంటి సునీత రెండో స్థానంలో నిలువగా, భారతీయ జనతా పార్టీ అభ్యర్థికి డిపాజిట్ గల్లంతు అయింది. దీనిపై తెలంగాణ జాగృతి సంస్థ అధ్యక్షురాలు కె.కవిత తనదైనశైలిలో స్పందించారు.
'కర్మ హిట్స్ బ్యాక్' అంటూ ఆసక్తికర పోస్ట్ చేశారు. తనపై కుట్ర పన్ని భారత రాష్ట్ర సమితి నుంచి బహిష్కరించడంతో ఆమె ఆగ్రహంతో ఊగిపోతున్నారు. పైగా, భారాస నేతలను లక్ష్యంగా చేసుకుని విమర్శలు గుప్పిస్తున్నారు. ఈ నేపథ్యంలో జూబ్లీహిల్స్ ఫలితాలపై ఆమె ఆసక్తికర ట్వీట్ చేశారు.
ఇదిలావుంటే, శుక్రవారం వెలువడిన జూబ్లీహిల్స్ ఫలితాల్లో భారత రాష్ట్ర సమితి ఓటమి చవి చూసిన సంగతి తెలిసిందే. ఉప ఎన్నికలో కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్‌కు 98,988 ఓట్లు, భారత రాష్ట్రసమితి అభ్యర్థి మాగంటి సునీతకు 74,259 ఓట్లు, భాజపా అభ్యర్థి లంకల దీపక్‌రెడ్డికి 17,061 ఓట్లు పోలయ్యాయి. దీంతో నవీన్ యాదవ్ 24 వేల పై చిలుకు ఓట్ల మెజార్టీతో గెలుపొందారు.