కేసీఆర్‌ను విమర్శించేందుకు ఆయన కుమార్తె కవిత ఉన్నారు : మంత్రి కోమటిరెడ్డి
భారాస అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్‌ను విమర్శించేందుకు తాము అక్కర్లేదని, ఆయన సొంత కుమార్తె కల్వకుంట్ల కవిత ఉన్నారని తెలంగాణ రాష్ట్ర మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి అన్నారు. ఆయన పాలమూరు జిల్లాలోని దేవరకద్ర నియోజకవర్గంలో పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, బీఆర్ఎస్ పార్టీని, ఆ పార్టీ అధినేత కేసీఆర్‌ను, ఆయన తనయుడు కేటీఆర్‌ను, మేనల్లుడు హరీష్ రావు, ఇతర భారాస నేతలను విమర్శించేందుకు తాము అక్కర్లేదని, ఆయన కుమార్తె, తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కె.కవిత ఉన్నారని తెలిపారు.
పైగా, కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో చేసిన అప్పులను తమ కాంగ్రెస్ ప్రభుత్వం తీర్చే ప్రయత్నం చేస్తోందన్నారు. అప్పులు తీరుస్తూనే రాష్ట్ర అభివృద్ధి కోసం తమ ప్రభుత్వం నిరంతరం కృషి చేస్తోందని అన్నారు. కేసీఆర్ వల్ల పాలమూరుకు తీవ్ర అన్యాయం జరిగిందని మంత్రి ఆరోపించారు.
పాలమూరు - రంగారెడ్డి ప్రాజెక్టుకు రూ.80 వేల కోట్లు చేయాల్సి వుండగా, రూ.27 కోట్లు మాత్రమే ఖర్చు చేస్తే 99 శాతం పనులు ఎలా పూర్తవుతాయో కేసీఆర్ చెప్పాలని డిమాండ్ చేశారు. అబద్దాలు చెప్పి మోసాలు చేయాలని చూస్తే ప్రజలు ఇచ్చిన తీర్పును గుర్తుపెట్టుకోవాలని మంత్రి హెచ్చరించారు.
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఒక్క రోజు కూడా సెలవు లేదా విశ్రాంతీ తీసుకోకుండా రాష్ట్ర అభివృద్ధి కోసం పని చేస్తున్నారన్నారు. కేసీఆర్ మాత్రం ఏదో ఒక రోజు మాత్రమే పనుల కోసం సమయం కేటాయిస్తున్నారని విమర్శించారు. అందుకే అసెంబ్లీ, లోక్‌సభ ఎన్నికల్లో ప్రజలు వారికి తగిన గుణపాఠం చెప్పారని వ్యాఖ్యానించారు. వివిధ సంక్షేమ పథకాల అమలు కోసం కాంగ్రెస్ ప్రభుత్వం రూ.వేల కోట్లు ఖర్చు చేస్తోందని అన్నారు.