ఏడాదిగా వేధింపులు.. టెక్కీని కారులో బలవంతంగా ఎక్కించుకుని...?
మహిళలపై వయోబేధం లేకుండా ఎక్కడపడితే అక్కడ లైంగిక వేధింపులు జరుగుతూనే వున్నాయి. తాజాగా ఏడాది పాటు ఒక సాఫ్ట్‌వేర్ ఉద్యోగినిని వేధిస్తున్న యువకుడు, ఆమె తన లైంగిక వేధింపులను తిరస్కరించడంతో ఆమెపై దాడి చేశాడు. ఈ ఘటన రంగారెడ్డి జిల్లా, శంషాబాద్‌లో బుధవారం జరిగింది.
ఆర్‌జీఐఏ పోలీసుల ప్రకారం, జార్ఖండ్‌కు చెందిన 25 ఏళ్ల మహిళ హైదరాబాద్‌లోని ఒక ప్రముఖ సాఫ్ట్‌వేర్ కంపెనీలో మేనేజర్‌గా పనిచేస్తోంది. మాదాపూర్‌లో నివసిస్తోంది. ఆమె అభ్యంతరాలు చెప్పినప్పటికీ, ఆమె సహోద్యోగి అయిన ఆకాష్ ఆమెను వెంబడిస్తూనే ఉన్నాడు.
గతంలో ఆమె మాదాపూర్ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో అతను వెనక్కి తగ్గాడు. బుధవారం, ఆమె ఢిల్లీలోని బంధువులను కలిసి తిరిగి వస్తుండగా, శంషాబాద్ విమానాశ్రయంలో ఆకాష్ ఆమెను అడ్డగించి, బలవంతంగా కారులోకి ఎక్కించుకుని హైదరాబాద్ వైపు తీసుకెళ్లాడు.
ఈ క్రమంలో వాగ్వాదం జరగడంతో, అతను ఆమెపై పిడిగుద్దులు కురిపించి, వాహనం నుండి బయటకు తోసివేసి పారిపోయాడు. తీవ్రంగా గాయపడిన ఆ మహిళను స్థానికులు ఆసుపత్రికి తరలించారు. శంషాబాద్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
