నీటి సంక్షోభం.. బాలల హక్కులకు పెను సవాలు!
నీరు ప్రతి మనిషి ప్రాథమిక అవసరం. ముఖ్యంగా పిల్లలకు సురక్షితమైన తాగునీరు అందడం వారి ఆరోగ్యం, మనుగడ, అభివృద్ధికి ఎంతో కీలకం. అయితే వాతావరణ మార్పులు, వర్షపాతంలో అస్థిరత, భూగర్భజలాల తగ్గుదల, నీటి కాలుష్యం వంటి సమస్యలు నీటి భద్రతకు సవాలుగా మారుతున్నాయి. ఎల్నినో ప్రభావంతో వాతావరణ పరిస్థితుల్లో మార్పులు సంభవించే అవకాశం ఉన్నందున నీటి సంరక్షణపై ప్రతి ఒక్కరూ దృష్టి సారించాలి.
నీటి కొరత కేవలం పర్యావరణ సమస్య మాత్రమే కాదు.. అది పిల్లల హక్కులకు సంబంధించిన అంశం కూడా. సురక్షితమైన నీరు అందుబాటులో లేకపోతే పిల్లలు కలుషిత నీటి ద్వారా వ్యాపించే వ్యాధుల బారిన పడే ప్రమాదం ఉంది. కొన్ని ప్రాంతాల్లో నీటిని సేకరించే బాధ్యత పిల్లలపై, ముఖ్యంగా బాలికలపై పడటంతో వారి చదువు, ఆటలు, విశ్రాంతికి ఆటంకం కలుగుతోంది. పాఠశాలల్లో తాగునీరు, పరిశుభ్రమైన మరుగుదొడ్లు అందుబాటులో ఉండటం కూడా అత్యవసరం.
ఐక్యరాజ్యసమితి బాలల హక్కుల ఒడంబడికలోని ఆర్టికల్ 6 పిల్లల మనుగడ, అభివృద్ధి హక్కులను, ఆర్టికల్ 24 వారి ఆరోగ్య హక్కును గుర్తిస్తున్నాయి. ఈ హక్కులను పరిరక్షించేందుకు ప్రభుత్వాలు, స్థానిక సంస్థలు ప్రతి ఇంటికి, పాఠశాలకు, అంగన్వాడీ కేంద్రానికి సురక్షితమైన తాగునీరు అందేలా చర్యలు తీసుకోవాలి. నీటి నాణ్యతను క్రమం తప్పకుండా పరీక్షించడంతో పాటు వర్షపు నీటి సంరక్షణ, చెరువుల పరిరక్షణ, భూగర్భజలాల పునరుద్ధరణకు ప్రాధాన్యత ఇవ్వాలి.
ప్రజలు కూడా నీటిని వృథా చేయకుండా పొదుపుగా వినియోగించడం, నీటి వనరులను కలుషితం కాకుండా కాపాడటం, వర్షపు నీటిని ఒడిసిపట్టడం వంటి చర్యల్లో భాగస్వాములు కావాలి. పాఠశాలలు, గ్రామ పంచాయతీలు, పౌర సమాజ సంస్థలు కలిసి నీటి సంరక్షణపై అవగాహన పెంచాలి.
ప్రతి బిడ్డకు సురక్షితమైన నీరు అందించడం దయ కాదు.. అది హక్కు! నీటి భద్రతను పిల్లల హక్కుల పరిరక్షణలో అంతర్భాగంగా గుర్తించి సమిష్టిగా కృషి చేయాలి. నీటిని సంరక్షించడం ప్రకృతి పట్ల మన బాధ్యత మాత్రమే కాదు.. భావితరాల భవిష్యత్తును కాపాడే సంకల్పం కూడా.
నీటిని కాపాడుదాం.. పిల్లల హక్కులను పరిరక్షిద్దాం.. భావితరాలకు భద్రమైన భవిష్యత్తును అందిద్దాం!
-చందన మారిపల్లి
సభ్యురాలు, తెలంగాణ రాష్ట్ర బాలల హక్కుల పరిరక్షణ కమిషన్

