టాయిలెట్ వాష్ బేషన్‌లో పడి పసిగుడ్డు మృతి
టాయిలెట్ వాష్ బేషన్‌లో పడి పసిగుడ్డు మృతి చెందిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. సికింద్రాబాద్ రసూల్ పురలో కడుపు నొప్పితో ఓ యువతి బ్రైట్ హోమియో క్లినిక్‌కు వచ్చింది. కడుపు నొప్పి విపరీతం కాగా.. బాత్రూంకు వెళ్ళాలని కోరడంతో.. క్లినిక్‌లో బాత్రూం లేదని ఎదురుగా ఉన్న వారి ఇంటికి పంపించారు.
బాత్రూం నుంచి తీవ్ర రక్తస్రావంతో బయటకి రాగా.. పుట్టిన పాప సింక్‌లో పడిపోయిందని ఆ ఇంటివారికి తెలిపింది. దీంతో ఆ ఇంటివారు వెంటనే బయటకు తీసి పోలీసులకు సమాచారం అందించి, గాంధీ ఆసుపత్రికి తరలించారు. కాని అప్పటికే పసిగుడ్డు కన్నుమూయగా, అవివాహిత కావడంతో విషయం బయటకు రాకుండా జాగ్రత్తపడ్డారు.
కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. కానీ పాప మృతిపై అనేక అనుమానాలు తలెత్తుతున్నాయి. అబార్షన్ కోసమే వైద్యురాలి దగ్గరకు వచ్చిందని.. ఆమె ఇచ్చిన మెడిసిన్‌తోనే ఇలా జరిగి ఉండవచ్చన్న ఊహాగానాలు వినిపిస్తున్నాయి. బేగంపేట పోలీసుల మాత్రం విషయం బయటకు రాకుండా అనుమానస్పద మృతిగా కేసు నమోదు చేశారు.
వైద్యురాలు మాత్రం ఆసుపత్రి మూసి అందుబాటులో లేకుండా పోయారు. పధకం ప్రకారం వాష్ బేషన్‌లో వేసి పాపను చంపిందా లేక పడిపోయిందా అన్న కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.