1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
  4. Heavy Rains forecast in telangana today and tomorrow

నేడు రేపు వర్షాలు - తెలంగాణాలో ఆరెంజ్ అలెర్ట్

Heavy Rains
బంగాళాఖాతంలో శనివారం ఏర్పడిన అల్పపీడనం బలపడి, తీవ్ర అల్పపీడనంగా మారిందని హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం ప్రకటించింది. వాయువ్య, పరిసర పశ్చిమ మధ్య బంగాళాఖాతం ప్రాంతాల్లో కొనసాగుతున్న ఈ తీవ్ర అల్పపీడనం.. ఉత్తర ఒడిసా, పశ్చిమ బెంగాల్‌ తీరం దగ్గర వాయుగుండంగా మారే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు వెల్లడించారు. 
 
వాయుగుండం.. పశ్చిమ - వాయవ్య దిశలో ప్రయాణిస్తూ రెండు, మూడు రోజుల్లో ఉత్తర ఒడిసా, ఉత్తర ఛత్తీ్‌సగఢ్‌ మీదుగా వెళ్తుందని అంచనాలో ఉన్నట్లు తెలిపారు. ఈ ప్రభావంతో రాష్ట్రంలో రెండు రోజులు పలుచోట్ల భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే వీలున్నట్లు తెలిపారు. 
 
మరోవైపు పశ్చిమ - వాయవ్య దిశలో వాయుగుండం ప్రయాణిస్తున్న నేపథ్యంలో ఆదివారం హైదరాబాద్‌ నగరంలో వాతావరణం చల్లబడింది. మబ్బులు కమ్మి ఆహ్లాదకరంగా మారింది. గరిష్ఠ ఉష్ణోగ్రత సాధారణం కంటే ఒక డిగ్రీ తక్కువగా (30.4 డిగ్రీలు) నమోదైంది. మరో రెండు రోజుల వరకు గరిష్ఠ, కనిష్ఠ ఉష్ణోగ్రతల్లో తగ్గుదల ఉంటుందని వాతావరణ కేంద్ర అధికారులు చెప్పారు. 
 
ఇదిలావుంటే, తెలంగాణలో నేడు, రేపు అక్కడక్కడ భారీ వర్షాలు కురిసే అవకాశాలున్నాయని వాతావరణ శాఖ తెలిపింది. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం నేడు వాయుగుండంగా మారి, ఒడిశా, చత్తీస్‌గఢ్ రాష్ట్రాల మీదుగా పయనించే అవకాశం ఉంది. 
 
అలాగే, దీనికి అనుబంధంగా 7.6 కిలోమీటర్ల ఎత్తు వరకు గాలులతో  ఉపరితల ఆవర్తనం కూడా ఏర్పడింది. ఇంకోవైపు, పశ్చిమ భారతదేశం నుంచి తెలంగాణ వైపు తక్కువ ఎత్తులో గాలులు వీస్తున్నాయి. వీటి ప్రభావంతో నేడు, రేపు తెలంగాణలో అక్కడక్కడ భారీ వర్షాలు కురిసే అవకాశం ఉండడంతో ఆరెంజ్ అలెర్ట్ జారీ చేశారు.
About Writer
ఠాగూర్
తర్వాతి కథనం
మగువలకు శుభవార్త : తగ్గిన బంగారం ధరలు