మంగళవారం, 24 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By ఎం
Last Updated : శుక్రవారం, 6 డిశెంబరు 2019 (17:53 IST)

హైదరాబాద్‌ పోలీసులను చూసి నేర్చుకోవాలి... ఎన్‌కౌంటర్‌పై దేశవ్యాప్తంగా ప్రశంసల వెల్లువ

సంచలనం సృష్టించిన దిశ అత్యాచారం, హత్య కేసులో నిందితులను పోలీసులు ఎన్‌కౌంటర్‌ చేయడంపై సర్వత్రా ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి. నిందితుల చావుతో దిశకు న్యాయం జరిగిందంటూ ప్రముఖుల నుంచి సామాన్యుల వరకు సోషల్‌మీడియా వేదికగా సంతోషం వ్యక్తం చేస్తున్నారు. హైదరాబాద్‌ పోలీసులకు కృతజ్ఞతలు చెబుతున్నారు.
 
'థ్యాంక్యూ హైదరాబాద్‌ పోలీస్‌. రేపిస్టులను డీల్‌ చేసే పద్ధతి ఇదే. ఇతర రాష్ట్రాల పోలీసులు కూడా మీ నుంచి నేర్చుకుంటారని ఆశిస్తున్నా’ - భాజపా నేత కపిల్‌ మిశ్రా
 
'దేశవ్యాప్తంగా నిత్యం అత్యాచార ఘటనలు జరుగుతూనే ఉన్నాయి. అలాంటి నిందితులకు ఇలాంటి కఠిన చర్యలే సరైనవి. దిల్లీ సహా అన్ని రాష్ట్రాల పోలీసులు హైదరాబాద్‌ పోలీసుల నుంచి స్ఫూర్తి పొందాలి. నిర్భయకు కూడా త్వరలోనే న్యాయం జరుగుతుందని ఆశిస్తున్నా’ - బీఎస్పీ అధినేత్రి మాయావతి
 
'ఓ సాధారణ పౌరురాలిగా నాకు చాలా ఆనందంగా ఉంది. నిందితులకు ఉరిశిక్ష వేయాలని మేం డిమాండ్‌ చేశాం. ఏ పరిస్థితుల్లో పోలీసులు ఎన్‌కౌంటర్‌ చేశారో తెలియదు గానీ..  ఇక్కడ పోలీసే ఉత్తమ న్యాయమూర్తి- జాతీయ మహిళా కమిషన్‌ ఛైర్‌పర్సన్‌ రేఖా శర్మ
 
'దిశ నిందితుల ఎన్‌కౌంటర్‌ సమాజానికి ఓ మంచి ఉదాహరణ. ఇక నుంచి రేపిస్టులు నేరం చేసేముందు ఒకటికి రెండు సార్లు ఆలోచిస్తారు. ఎన్‌కౌంటర్‌లో చనిపోతామేమోనన్న భయం ఉంటుంది’- మహిళా హక్కుల కార్యకర్త తృప్తి దేశాయ్‌
 
'ఈ ఏడాదిలో ఇదే అతి పెద్ద సంఘటన. మహిళల భద్రతకు ఇది గ్యారెంటీ లాంటిది. కన్నకూతుర్ని కోల్పోయిన ఆ తల్లిదండ్రుల బాధను తీర్చలేం. కానీ, ఇప్పుడు ఆమె ఆత్మకు శాంతి చేకూరింది. మహిళల్లో భయం కాస్త తగ్గింది. జై తెలంగాణ పోలీస్‌. క్రిమినల్స్‌కు ఎలా బుద్ధి చెప్పాలో తెలంగాణ పోలీసులను చూసి ఇతర రాష్ట్రాల ప్రభుత్వాలు నేర్చుకుంటారని నమ్ముతున్నా’ - భాజపా సీనియర్‌ నాయకురాలు ఉమాభారతి.
 
'నేరస్థులు పారిపోవడానికి ప్రయత్నించినప్పుడు పోలీసులకు ఎన్‌కౌంటర్‌ చేయడం కంటే మరో అవకాశం ఉండదు’ - ఛత్తీస్‌గఢ్‌ ముఖ్యమంత్రి భూపేశ్‌ భగేల్‌