మంగళవారం, 24 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By ఎం
Last Updated : శుక్రవారం, 6 డిశెంబరు 2019 (08:09 IST)

అంత‌ర్జాతీయ స్థాయిలో ర‌వాణా వ్య‌వ‌స్థ‌ మెరుగుదల‌: కె.టి.ఆర్

శ‌రవేగంగా అభివృద్ది చెందుతున్న హైద‌రాబాద్ న‌గ‌రంలోని రోడ్లను వాహ‌నాలు, పాదచారులు సౌక‌ర్యంగా ప్ర‌యాణించేందుకు అనువుగా అంత‌ర్జాతీయ స్థాయిలో ఉన్న‌త ప్ర‌మాణాల‌తో అభివృద్ది చేయ‌నున్న‌ట్లు రాష్ట్ర మున్సిప‌ల్, ఐటి శాఖ‌ మంత్రి కె.టి.రామారావు పేర్కొన్నారు.

అలాగే ట్రాఫిక్ వ్య‌వ‌స్థ‌ను శాస్త్రీయంగా క్ర‌మ‌బ‌ద్దీక‌రించేందుకు ఏర్పాట్లు చేయ‌నున్న‌ట్లు తెలిపారు. గురువారం బుద్ద‌భ‌వ‌న్‌లో పోలీసు, జిహెచ్ఎంసి ఉన్న‌తాధికారుల‌తో స‌మావేశం నిర్వ‌హించారు. ఎల‌క్ట్రిసిటి, టి.ఎస్‌.ఐ.ఐ.సి, జ‌ల‌మండ‌లి అధికారులను కూడా ఈ స‌మావేశానికి పిలిచారు.

ఈ సంద‌ర్భంగా మంత్రి మాట్లాడుతూ అన్ని శాఖల మ‌ధ్య స‌మ‌న్వ‌యం ఉండాల‌ని స్ప‌ష్టం చేశారు. ప్ర‌పంచ వ్యాప్తంగా ప‌బ్లిక్ ట్రాన్స్‌పోర్ట్ వ్య‌వ‌స్థ‌కు ఆద‌ర‌ణ ఎక్కువ‌గా ఉన్న‌ద‌ని తెలిపారు. ముంబాయిలో 72శాతం ప‌బ్లిక్ ట్రాన్స్‌పోర్ట్‌ను వినియోగిస్తుంటే హైద‌రాబాద్‌లో 34శాతం మాత్ర‌మే ప‌బ్లిక్ ట్రాన్స్‌పోర్ట్ వినియోగిస్తున్నార‌ని తెలిపారు.

ఐదేళ్ల‌లో వాహ‌నాల సంఖ్య 73 ల‌క్ష‌ల నుండి ఒక‌కోటి 20ల‌క్ష‌ల‌కు పెరిగిన‌ట్లు తెలిపారు. ప‌బ్లిక్ ట్రాన్స్‌పోర్ట్‌వైపు ప్ర‌జ‌ల‌ను మ‌ళ్లించుట‌కు ర‌వాణా వ్య‌వ‌స్థ‌ను మెరుగుప‌ర్చ‌నున్న‌ట్లు తెలిపారు. మెట్రో రైలు, ఎం.ఎం.టి.ఎస్ మార్గాలు, స్టేష‌న్లు, ప్ర‌ధాన ర‌హ‌దారుల‌కు ఇరువైపులా ఫుట్‌పాత్‌లు, లైనింగ్‌, సైకిల్ వేలు, గ్రీన‌రీల‌ను అభివృద్ది చేయ‌నున్న‌ట్లు తెలిపారు. 

పార్కింగ్ ఏరియాల‌ను కూడా ఎక్కువ‌గా ఏర్పాటు చేయ‌నున్న‌ట్టు తెలిపారు. ఖాళీ ప్లాట్ల‌ను పార్కింగ్ ప్ర‌దేశాలుగా ఏర్పాటు చేసేందుకు  ప్రైవేట్ య‌జ‌మానుల అంగీకారాన్ని తీసుకోవాల‌ని అధికారుల‌ను ఆదేశించారు. ప్రైవేట్ స్థ‌లాల్లో పార్కింగ్‌తో సంబంధిత స్థ‌లాల య‌జ‌మానుల‌కు ఆదాయం స‌మ‌కూరుతుంద‌ని తెలిపారు.

లేఅవుట్ ఓపెన్ ప్లాట్ల‌ను ప్ర‌జాప్ర‌యోజ‌నార్థం ప‌బ్లిక్ టాయిలెట్లు, బ‌స్‌షెల్ట‌ర్లు, స్కై వాక్ వేల‌ను, గ్రీన‌రీల‌కు వినియోగించ‌నున్న‌ట్టు తెలిపారు. రోడ్ల అభివృద్దిలో భాగంగా 709 కిలోమీట‌ర్ల ప్ర‌ధాన ర‌హ‌దారుల‌ను సి.ఆర్‌.ఎం.పి కింద తీసుకువ‌చ్చిన‌ట్లు తెలిపారు. ఈ నెల 9 నుండి సి.ఆర్‌.ఎం.పి ప‌నుల‌ను చేపట్టుట‌కు చ‌ర్య‌లు తీసుకోవాల‌ని జోన‌ల్ క‌మిష‌న‌ర్ల‌ను ఆదేశించారు.

ఐదు సంవ‌త్స‌రాల పాటు పూర్తిగా ఆయా రోడ్ల‌ను నిర్వ‌హించే బాధ్య‌త సంబంధిత ఏజెన్సీల‌దేన‌ని స్ప‌ష్టం చేశారు. పైప్‌లైన్లు, కేబుళ్ల, డ్రైనేజీ త‌వ్వ‌కాలు, మ‌ర‌మ్మ‌తుల‌ను సంబంధిత ఏజెన్సీల ద్వారానే చేప‌ట్టాల్సి ఉంటుంద‌ని తెలిపారు. త‌వ్వ‌కాలు, మ‌ర‌మ్మ‌తులతో పాటు పున‌రుద్ద‌ర‌ణ ప‌నిని కూడా సి.ఆర్‌.ఎం.పి ఏజెన్సీనే చేస్తోంద‌ని తెలిపారు. ఏజెన్సీలు చేప‌ట్టే ప‌నుల‌కు ప్ర‌భుత్వం, జిహెచ్ఎంసి, పోలీసు యంత్రాంగం పూర్తిగా స‌హ‌క‌రిస్తుంద‌ని తెలిపారు. 

ట్రాఫిక్ వ్య‌వ‌స్థ‌ను స‌మ‌న్వ‌యం చేసేందుకు జిహెచ్ఎంసి ప‌రిధిలో ప్ర‌త్యేక ట్రాఫిక్ క‌మిష‌న‌రేట్ ఏర్పాటు చేయ‌నున్న‌ట్టు తెలిపారు. క‌మ‌ర్షియ‌ల్ ఏరియాల‌లో ఉన్న సెట్‌బ్యాక్ స్థ‌లాన్ని కూడా ఫుట్‌వేల‌కు వినియోగించ‌నున్న‌ట్లు తెలిపారు.
 
మ‌హిళ‌ల భ‌ద్ర‌త చ‌ర్య‌ల‌పై విస్తృతంగా చ‌ర్చించిన మంత్రి కె.టి.ఆర్‌
మ‌హిళ‌ల భ‌ద్ర‌త‌పై ప్ర‌త్యేక దృష్టి సారించాల‌ని అధికారుల‌కు మంత్రి కె.టి.ఆర్ సూచించారు. న‌గ‌రంలోని స‌మ‌స్యాత్మ‌క ప్రాంతాల‌ను గుర్తించి నివార‌ణ చ‌ర్య‌లు చేప‌ట్టాల‌ని ఆదేశించారు. టోల్ ఫ్రీ నెంబ‌ర్ 100 కు విస్తృతంగా ప్ర‌చారం క‌ల్పించాల‌ని తెలిపారు.

వైన్స్ షాపులు, దాని చుట్టుప్ర‌క్క‌ల ప్రాంతాల్లో మ‌ద్యం సేవించేవారిపై చ‌ర్య‌లు తీసుకోవాల‌ని తెలిపారు. సంబంధిత వైన్స్ షాపుల‌ను మూసివేయించాల‌ని తెలిపారు. పార్కులు, ఖాళీ స్థ‌లాలు అసాంఘీక శ‌క్తుల అడ్డాలుగా మార‌రాద‌ని తెలిపారు.

న‌గ‌రంలో 4ల‌క్ష‌ల ఎల్‌.ఇ.డి లైట్లు ఉన్నాయ‌ని, అన్ని రోడ్ల‌పై లైటింగ్‌ను పెంచుట‌కు అద‌నంగా మరిన్ని  ఎల్‌.ఇ.డి లైట్ల‌ను ఏర్పాటు చేయ‌నున్న‌ట్లు తెలిపారు. జిహెచ్ఎంసి ద్వారా మ‌హిళ‌ల భ‌ద్ర‌త‌కై చేప‌ట్టిన అవ‌గాహ‌న స‌ద‌స్సులు, ప‌బ్లిసిటీ కార్య‌క్ర‌మాల‌ను అభినందించారు. 
 
డిజిపి మ‌హేంద‌ర్‌రెడ్డి మాట్లాడుతూ రోడ్ల నిర్వ‌హ‌ణపై సి.ఆర్‌.ఎం.పి ఆలోచ‌న గ‌త 25 సంవ‌త్స‌రాల క్రిత‌మే త‌న‌కు ఉన్న‌ట్లు తెలిపారు. ప్ర‌భుత్వం ఈ విధంగా ప‌నులు చేప‌ట్ట‌డం ప‌ట్ల సంతోషం వ్య‌క్తం చేశారు. ప్ర‌జ‌ల‌కు సౌక‌ర్య‌వంతంగా ర‌వాణా స‌దుపాయాలు, రోడ్లు ఉంటే ట్రాఫిక్ స‌మ‌స్య ఉండ‌ద‌ని తెలిపారు. అంత‌ర్జాతీయంగా అభివృద్ది చెందిన దేశాల్లో రోడ్ల నిర్మాణం, నిర్వ‌హ‌ణ‌, ట్రాఫిక్ నియంత్ర‌ణ ప‌నుల‌ను ట్రాన్స్‌పోర్ట్ విభాగ‌మే చేస్తుంద‌ని తెలిపారు.

భార‌త ఉప ఖండంలో మాత్ర‌మే ట్రాన్స్‌పోర్ట్ విభాగం లైసెన్సులు జారీచేయ‌డం మాత్ర‌మే చేస్తున్న‌ట్లు తెలిపారు. రోడ్ల నిర్వ‌హ‌ణ స‌క్ర‌మంగా లేక‌పోవ‌డం వ‌ల్లే మ‌న దేశంలోని రోడ్డు ప్ర‌మాదాలు ఎక్కువ‌గా జ‌రుగుతున్న‌ట్లు తెలిపారు. ట్రాఫిక్ సిగ్న‌లింగ్ వ్య‌వ‌స్థ‌ను కూడా ఆధునీక‌రించేందుకు నిధులు మంజూరు చేయాల‌ని ఈ సంద‌ర్భంగా కోరారు.
 
ఈ స‌మావేశంలో న‌గ‌ర మేయ‌ర్ బొంతు రామ్మోహ‌న్‌, మున్సిప‌ల్ శాఖ ప్రిన్సిప‌ల్ సెక్ర‌ట‌రీ అర్వింద్ కుమార్‌, జిహెచ్ఎంసి క‌మిష‌న‌ర్ డి.ఎస్‌.లోకేష్ కుమార్‌, చీఫ్ ఇంజ‌నీర్, పోలీసు క‌మిష‌న‌ర్లు, అసిస్టెంట్ పోలీసు క‌మిష‌న‌ర్లు, జిహెచ్ఎంసి అడిష‌న‌ల్ క‌మిష‌న‌ర్లు, జోన‌ల్ క‌మిష‌న‌ర్లు త‌దిత‌రులు పాల్గొన్నారు.