గురువారం, 2 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఎం
Last Updated : బుధవారం, 27 నవంబరు 2019 (17:47 IST)

అక్రమంగా మద్యం సరఫరా.. వైకాపా నేతల అరెస్టు

పొరుగు రాష్ట్రమైన కర్నాటకకు అక్రమంగా మద్యం సరఫరా చేస్తున్న వైకాపా నేతలను కర్నూలు జిల్లా పోలీసులు అరెస్టు చేశారు. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, కర్నూలు జిల్లా పత్తికొండకు గత కొంతకాలంగా అక్రమంగా కర్ణాటక మద్యాన్ని తరలిస్తున్నట్లు పోలీసులకు సమాచారం వచ్చింది. 
 
ముఖ్యంగా, ఆదివారం రాత్రి బొలేరో వాహనంలో మద్యాన్ని తరలిస్తున్నారన్న సమాచారంతో ఆబ్కారీశాఖ కాపుకాసి అక్రమంగా తరలిస్తున్న కర్ణాటక మద్యంను దేవనకొండ క్రాస్ దగ్గర పోలీసులు చాకచక్యంగా పట్టుకున్నారు. 
 
ఈ కేసుపై కర్నూలు జిల్లా డీసీ చెన్న కేశవరావు తెలిపిన వివరాల ప్రకారం, ఆలూరు మండలంలోని అరికేర, హత్తి బేళగల్ గ్రామానికి చెందిన వారిగా గుర్తించారు. ఆలూరు నియోజకవర్గ వైస్సార్సీపీ యువజన అధ్యక్షుడు అరికేర వీరేశ్, బోయ తిక్కయ్య, హత్తి బేలాగల్, మాజీ ఎంపీటీసీ నాగేంద్ర, బోయ లింగన్న ఆదివారం రాత్రి బళ్ళారి నుంచి బొలేరో(ఏపీ 02 వై 0707) వాహనంలో రూ.100000 విలువ గల మద్యాన్ని అక్రమంగా దేవనకొండ మీదుగా పత్తికొండకు తరలిస్తున్నారు. 
 
దేవనకొండ క్రాస్ సమీపంలో పోలీసులు వాహనాన్ని ఆపి తనిఖీ చేయగా మద్యం పట్టుబడినట్లు తెలిపారు. వాహనంతో పాటు మద్యాన్ని స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. వీరేశ్, నాగేంద్ర, తిక్కయ్య, భిమన్నలపై కేసు నమోదు చేసి రిమాండ్‌కు తరలిస్తున్నట్లు తెలిపారు.