శనివారం, 11 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఎం
Last Updated : సోమవారం, 22 జులై 2019 (12:56 IST)

డేటా ఎంట్రీ ఆపరేటర్ల కారణంగా అధికారుల ఉద్యోగాలకు ఎసరు?

కొంతమంది డేటా ఎంట్రీ ఆపరేటర్లు చేసే తప్పుల వల్ల పలువురు అధికారుల ఉద్యోగాలకు ఎసరు వచ్చేలా ఉందని ఏపీ రాష్ట్ర రవాణా శాఖామంత్రి పేర్ని నాని అన్నారు. ఆయన ఆదివారం మచిలీపట్నం వేదికగా రాష్ట్ర స్థాయి రహదారి భద్రతా - అవగాహనా సదస్సును ప్రారంభించారు. ఇందులో రవాణ శాఖ ఉన్నతాధికారులతో పాటు 13 జిల్లాల రవాణ శాఖాధికారులు పాల్గొన్నారు. 
 
ఈ సందర్భంగా మంత్రి పేర్ని నాని మాట్లాడుతూ, శాఖాపరమైన లక్ష్యం కోసం పెద్దలపై గురి పెట్టాలన్నారు. చిన్నవారి మీద ప్రతాపం వద్దన్నారు. ఎన్‌ఫోర్స్‌మెంట్ దాడులు పెరగాలని సూచించారు. ప్రధానంగా హైవేలపై డ్రంక్ అండ్ డ్రైవ్ నిర్వహించాలి కోరారు. ప్రైవేట్ బస్సులతో పాటు ఆర్టీసీ బస్సులను కూడా వదలద్దని సూచించారు. ఆదాయ లక్ష్యమేకాకుండా లోపాలన్నీ సరి చేసే విధంగా ఎన్ఫోర్స్మెంట్ దాడులు జరగాలన్నారు.
 
మరీ ముఖ్యంగా ఇసుక అక్రమ రవాణదారులను విడిచి పెట్టవద్దన్నారు. ఇపుడు ఇసుక ఓ వ్యాపారంగా మారిపోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. వాహనాల ఇన్వాయిస్‌లలో మాయాజాలం చూపుతున్న డీలర్ల ఆటకట్టించాలని కోరారు. రవాణా శాఖ ఆదాయానికి గండి కొట్టే డీలర్లపై దాడులకు పూర్తి స్వేచ్ఛ ఇస్తున్నట్టు చెప్పారు. 

నాతో సహా మీ మీద ఎటువంటి రాజకీయ, అధికారిక ఒత్తిళ్ళు ఉండవన్నారు. వాహనాల మీద వచ్చే లైఫ్‌టాక్స్ మీద వచ్చే ఆదాయమే రవాణ శాఖకు ప్రధానం  దాన్ని గండి కొట్టే చర్యలను ఉపేక్షించమన్నారు. రోడ్డు ప్రమాదాల నివారణపై ప్రత్యేక దృష్టి రహదారి భద్రతపై అవగాహనతోనే ప్రమాదాల నివారణ సాధ్యమన్నారు.  ఆ దిశగా ప్రభుత్వ చర్యలు ఉంటాయని తెలిపారు. 
 
త్వరలోనే 8వ తరగతి నుండి డిగ్రీ విద్యార్థులకు ప్రతి శనివారం నిపుణులతో రహదారి భద్రతపై ప్రత్యేక శిక్షణ తరగతులు నిర్వహిస్తామని చెప్పారు. రూ.20 కోట్లతో డ్రైవింగ్ ఇనిస్టిట్యూట్ సెంటర్‌ను త్వరలోనే ఏర్పాటు చేస్తామని తెలిపారు. పబ్లిక్ గ్రీవెన్స్‌లో రవాణ శాఖ రాష్ట్రంలోనే అగ్రస్థానంలో ఉన్నందుకు గర్వంగా ఉందన్నారు. ఇదే స్ఫూర్తి పబ్లిక్ గ్రీవెన్స్‌లో కనబర్చాలని, రవాణ శాఖ మీద ఉన్న అవినీతి మరక కేవలం అపోహ మాత్రమేనని చెప్పారు. శాఖాపరమైన ఇబ్బందులు, సమస్యల పరిష్కారానికి నెలలో ఒక శుక్రవారం తనతో పాటు ప్రిన్సిపల్ సెక్రటరీ, కమిషనర్‌తో కలిసి ఎంప్లాయిస్ గ్రీవెన్స్ నిర్వహిస్తామన్నారు. 
 
యూనిట్ ఆఫీస్‌లలో డేటా ఎంట్రీ ఆపరేటర్ల వల్ల కొన్ని ఇబ్బందులు వస్తున్నాయని, చివరకు కొంతమంది డేటా ఎంట్రీ ఆపరేటర్లు అధికారుల ఉద్యోగాలకే ఎసరు వచ్చేలా తప్పుదారి పట్టిస్తున్నారనీ, విధి నిర్వహణలో అప్రమత్తత అవసరమని తెలిపారు.