1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
  4. Telangana : 12 year old boy suicide in Manchiryala district for Cycle

సైకిల్ కొనివ్వలేదని ప్రాణాలు తీసుకున్న బాలుడు

Telangana
తెలంగాణ రాష్ట్రంలోని మంచిర్యాల జిల్లా లక్సెట్టిపేట మండలంలో ఓ విషాదకర ఘటన జరిగింది. తల్లిదండ్రులు సైకిల్ కొనివ్వలేదని ఓ బాలుడు బలవన్మరణానికి పాల్పడ్డాడు. జిల్లాలోని లక్సెట్టిపేట మండలం సూరారం గ్రామంలో ఈ ఘటన జరిగింది. 
 
ఈ గ్రామానికి చెందిన పారండ్ల మధు (12) అనే బాలుడు ఏడో తరగతి చదువుతున్నాడు. కొద్దిరోజులుగా తనకు సైకిల్ కొనివ్వమని తల్లిదండ్రులను అడుగుతూ వారిని ఒత్తిడి చేస్తూ వచ్చాడు. అయితే, తల్లిదండ్రులు కరోనా కారణంగా తమ ఆర్థిక ఇబ్బందుల దృష్ట్యా తర్వాత కొనిస్తామని సర్దిచెబుతూ వస్తున్నారు. 
 
అయితే, బాలుడు మాత్రం తల్లిదండ్రుల మాట వినలేదు. చుట్టుపక్కల పిల్లలందరూ సైకిల్ తొక్కుతున్నారని, తనకూ సైకిల్ కావాలని మారం చేశాడు. దీంతో గురువారం ఉదయం కుమారుడిని మందలించి తల్లిదండ్రులు కూలీ పనులకు వెళ్లారు. 
 
కానీ సాయంత్రం వాళ్లు వచ్చేసరికి కుమారుడు ఇంట్లో దూలానికి వేలాడుతూ కనిపించాడు. దీంతో తల్లిదండ్రులు బోరున విలపించసాగారు. తండ్రి రామస్వామి ఫిర్యాదు మేరకు ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
About Writer
ఠాగూర్