SIR: మీతో ఒక జోక్ పంచుకోవాలనుకుంటున్నాను.. సర్ ప్రక్రియలో నా పేరు లేదు.. ప్రకాష్ రాజ్
బెంగళూరులో జరుగుతున్న ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (SIR) ప్రక్రియలో తన పేరు జాబితా నుండి తొలగించబడిందని నటుడు ప్రకాష్ రాజ్ మంగళవారం ఆరోపించారు. తన ఎక్స్ ఖాతాలో పంచుకున్న ఒక వీడియోలో, ఈ ప్రక్రియ తర్వాత ఓటు హక్కును కోల్పోయిన 65 లక్షల మంది ఓటర్లలో తాను కూడా ఒకడినని ఆయన పేర్కొన్నారు.
"మీతో ఒక జోక్ పంచుకోవాలనుకుంటున్నాను. SIR తర్వాత బెంగళూరు నియోజకవర్గ ఓటర్ల జాబితా నుండి ఓటు హక్కు తొలగించబడిన 65 లక్షల మందిలో నేను ఒకడిని. మంచి జోక్ కదా? నేను ఈ నియోజకవర్గంలోనే పుట్టాను, ఇక్కడే నివసించాను, నా పాఠశాల, కళాశాల విద్య, సినీ ప్రస్థానం అంతా ఇక్కడే సాగింది. మీ సమాచారం కోసం చెబుతున్నాను, నేను ఈ నియోజకవర్గం నుండి ఎంపీ అభ్యర్థిగా కూడా పోటీ చేశాను.." అని జాతీయ అవార్డు గ్రహీత, విలక్షణ , బహుభాషా నటుడైన ప్రకాష్ రాజ్ అన్నారు. తన ఓటర్ ఐడిని తిరిగి పొందేందుకు ఎలాంటి ప్రక్రియను అనుసరించాలో తెలుసుకుంటానని రాజ్ అన్నారు.
"సరే, ఈ జోక్ బాగుంది. ఆట మొదలైంది. దీని కోసం నేను ఎలాంటి ప్రక్రియను పూర్తి చేయాలో చూద్దాం. నా ఓటర్ ఐడిని తిరిగి పొందడానికి ఏయే పత్రాలు చూపించాల్సి ఉంటుంది?" అని ప్రకాష్ రాజ్ వ్యాఖ్యానించారు.
