జూనియర్ ఎన్టీఆర్ భుజానికి ఆపరేషన్ సక్సెస్
టాలీవుడ్ హీరో జూనియర్ ఎన్టీఆర్ భుజానికి జరిగిన ఆపరేషన్ విజయవంతమైంది. హైదరాబాద్ నగరంలోని కిమ్స్ ఆస్పత్రిలో ఈ శస్త్రచికిత్స చేశారు. ఎన్టీఆర్ భుజానికి బుధవారం చేసిన ఆపరేషన్ విజయవంతమైనట్టు కిమ్స్ ఆస్పత్రి వర్గాలు ఓ హెల్త్ బులిటెన్‌ను విడుదల చేశాయి. ప్రత్యేక వైద్యనిపుణుల బృందం ఆయనకు ఆర్థోస్కోపిక్ సర్జరీని నిర్వహించినట్లు వెల్లడించాయి.
ప్రస్తుతం ఎన్టీఆర్ ఆరోగ్యంగా ఉన్నారని, వైద్యుల పర్యవేక్షణలో ఉన్నట్లు పేర్కొన్నాయి. రెండు, మూడు నెలల్లో ఆయన పూర్తిగా కోలుకుంటారని వైద్యబృందం తెలిపింది. ఇటీవల జిమ్‌లో కసరత్తులు చేస్తుండగా, ఎన్టీఆర్ భుజానికి గాయమైన విషయం తెల్సిందే. ప్రస్తుతం ఆయన ప్రశాంత్ నీల్ తెరకెక్కిస్తున్న 'డ్రాగన్'లో నటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రం షూటింగ్ శరవేగంగా సాగుతోంది. అయితే, ఆపరేషన్ కారణంగా ఈ చిత్రం చిత్రీకరణ పనులకు అంతరాయం ఏర్పడే అవకాశం ఉంది.
