గురువారం, 19 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By ఠాగూర్
Last Updated : గురువారం, 7 అక్టోబరు 2021 (16:37 IST)

'మా' కోసం మనమందరం : మ్యానిఫెస్టోను రిలీజ్ చేసిన మంచు విష్ణు

మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ (మా) ఎన్నికల్లో పోటీ చేస్తున్న హీరో మంచు విష్ణు తన ప్యానెల్ మేనిఫెస్టోను గురువారం విడుదల చేశారు. తాము గెలిస్తే ఏమేం చేస్తారో వివరించి మా సభ్యులను ఆకట్టుకునే ప్రయత్నం చేశారు. 
 
ఇదే అంశంపై మీడియా సమావేశంలో మేనిఫెస్టోలోని ముఖ్యాంశాలను వెల్లడించారు. నటీనటులకు మెరుగైన అవకాశాలు కల్పించేందుకు కృషి. ఇందుకోసం ప్రత్యేకంగా మా యాప్‌కు రూపకల్పన. డైరెక్టర్లు, నిర్మాతలు, రచయితలు, ప్రొడక్షన్ ఎగ్జిక్యూటివ్స్‌ను ఈ యాప్‌తో అనుసంధానం చేస్తామన్నారు.
 
ప్రత్యేకంగా జాబ్ కమిటీ ఏర్పాటు చేస్తాం. నిర్మాతలు, నిర్మాణ సంస్థలు, ఓటీటీ వేదికల వద్దకు వెళ్లి తమ జాబితాలో ఉన్న నటీనటులకు అవకాశాలు ఇచ్చేలా ఈ జాబ్ కమిటీ ప్రయత్నాలు చేస్తుంది. అవకాశాలు లేని నటీనటులకు ప్రాధాన్యం. నా సొంత డబ్బుతో మా భవనం నిర్మిస్తాం. మా భవనం కోసం మూడు స్థలాలు చూశామన్నారు. 
 
నటీనటుల సొంత ఇంటి కలను నెరవేరుస్తాం. ప్రభుత్వంతో మాట్లాడి మా సభ్యులకు సొంత ఇల్లు ఇప్పించే హామీ నాది. మాలో సభ్యత్వం ఉన్న ప్రతి ఒక్కరికీ ఉచిత ఆరోగ్య బీమా. ఇప్పటివరకు సగం వాటా మా, మరో సగం వాటా సభ్యుడు కట్టాల్సి వచ్చేది. ఇకపై ఆ అవసరంలేదు. ఆరోగ్య బీమా పూర్తి ఉచితంగా కల్పిస్తామన, బీమా మొత్తాన్ని రూ.3 లక్షల కంటే అధికంగా అందిస్తామని తెలిపారు. 
 
ఐదారుగురు ఉన్న కుటుంబానికి కూడా బీమా సౌకర్యం. ఇప్పటికే తెలంగాణ, ఏపీ రాష్ట్రాల్లోని ఆసుపత్రులతో మాట్లాడాం. అర్హుడైన ప్రతి సభ్యుడి పిల్లలకు కేజీ నుంచి పీజీ వరకు సహకారం అందిస్తాం. ఉపకారవేతనాలపై చర్చలు జరుగుతున్నాయి. అర్హులైన సభ్యులకు పెళ్లి ఖర్చుల కోసం రూ.1,16,000 వరకు సాయం చేస్తాం.
 
మహిళల రక్షణ కోసం హైపవర్ కమిటీ ఏర్పాటు. ఇలాంటి గ్రీవెన్స్ సెల్ టాలీవుడ్‌లో ఇదే ప్రథమం. మహిళా సభ్యుల భద్రత, ఆర్థిక భరోసా కోసం అన్ని ఏర్పాట్లు చేస్తాం. ఎంతోమంది తెలుగు నటీమణులు ఇండస్ట్రీకి రావాల్సి ఉంది. వాళ్లందరికీ మెరుగైన వాతావరణం కల్పిస్తాం. ముఖ్యంగా, వృద్ధ కళాకారులకు ఇప్పుడిస్తున్న రూ.6 వేల పెన్షన్‌ను మరింత పెంచుతామని తెలిపారు. 
 
'మా'లో ఉన్న కొందరికి ఓటు హక్కులేదు. మేం అధికారంలోకి వస్తే వారందరికీ ఓటు హక్కు కల్పిస్తామన్నారు. కరోనా వల్ల మా అందరికీ ఆదాయం తగ్గింది. ఈ నేపథ్యంలో కొత్త కళాకారులు 'మా'లో సభ్యత్వం కోరుకుంటే ఇప్పటివరకు అమలు చేసిన లక్ష రూపాయల ఫీజు స్థానంలో రూ.70 వేలే వసూలు చేస్తామని హామీ ఇచ్చారు. 
 
మోహన్ బాబు పేరిట ఫిలిం ఇన్ స్టిట్యూట్ ఏర్పాటు చేస్తున్నాం. వచ్చే జూన్ నెలలో ఇది ప్రారంభంకానుంది. కళాకారులు ఎంతోమంది తమ పిల్లలను 24 క్రాఫ్ట్స్‌లో ఒకదాంట్లో శిక్షణ ఇప్పించాలనుకుంటే వారికి తోడ్పాటు అందిస్తాం. మోహన్ బాబు ఫిలిం ఇన్‌‌స్టిట్యూట్‌లో వారికి 50 శాతం రాయితీ కల్పిస్తామన్నారు. 
 
ఇప్పటికే కార్యకలాపాలు సాగిస్తున్న ఇతర ఫిలిం ఇన్‌స్టిట్యూట్లతోనూ మాట్లాడినట్టు చెప్పారు. మేం గెలిచిన వెంటనే రెండు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులను, సినిమాటోగ్రఫీ శాఖల మంత్రులను కలుస్తాం. తెలుగు సినీ రంగ సమస్యలను పరిష్కరించాలని వారిని కోరతామని మంచు విష్ణు వివరించారు.