మంగళవారం, 26 నవంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By ఠాగూర్
Last Updated : బుధవారం, 6 అక్టోబరు 2021 (13:35 IST)

"మా" అధ్యక్షుడుగా మనలో ఒకడు పనికిరాడా? రవిబాబు ప్రశ్న

తెలుగు చిత్రపరిశ్రమకు చెందిన నటీనటులంతా కలిసి ఏర్పాటు చేసుకున్న సంస్థ మూవీ ఆర్టిస్ట్ అసోసియేష‌న్ (మా). దీన్నికి ఈ నెల 10వ తేదీన ఎన్నికలు జరుగనున్నాయి. అయితే, ఈ ఎన్నిక‌ల‌పై న‌టుడు, దర్శకుడు ర‌విబాబు సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. మా అధ్య‌క్షుడిగా తెలుగు వారినే ఎన్నుకోవాలని స్పష్టం చేశారు. తెలుగు న‌టుల కోసం ఏర్పాటు చేసుకున్న సంస్థ మా. అలాంటి సంస్థ‌ను న‌డిపేందుకు మ‌న‌లో ఒక‌రైనా ప‌నికిరారా? అని ప్ర‌శ్నించారు. 
 
నిర్మాత‌లు బ‌య‌టి నుంచి క్యారెక్ట‌ర్ ఆర్టిస్టుల‌ను తీసుకొస్తున్నారు. బ‌య‌టివాళ్ల డిమాండ్ల‌కు అంగీకరించిమరీ వేషాలు ఇస్తున్నారు. హైద‌రాబాద్‌లో 200 మంది కెమెరామెన్ల‌కు ప‌ని లేదని గుర్తుచేశారు. అలాగే, ఔట్‌డోర్ బిల్లులు చూసి నిర్మాత‌లు బెంబేలెత్తుతున్నారు. ముంబై నుంచే మేక‌ప్‌మెన్లు, హెయిర్ డ్రెస‌ర్లు వ‌స్తున్నారు. మరి తెలుగువారి పరిస్థితి ఏంటి అంటూ ఆయన ప్రశ్నించారు. 

'లోకల్‌ నాన్‌లోకల్‌ వివాదంపై మాట్లాడాలనుకోవడం లేదు. ఏదో ఒక ప్యానల్‌కు ఓటు వేయమని చెప్పాలనుకోవడం లేదు. మనకి ఎంతో మంది క్యారెక్టర్‌ ఆర్టిస్ట్‌లు ఉండగా.. మన దర్శక నిర్మాతలు మాత్రం బయటవాళ్లకే ఎక్కువగా అవకాశాలిస్తున్నారు. వాళ్ల డిమాండ్‌లకు ఒప్పుకొని మరీ ఆఫర్లు ఇస్తున్నారు. అదే మాదిరిగా కెమెరామెన్‌లు, మేకప్‌మేన్‌లు.. ఇలా ఒక్కటేమిటి.. సినిమాకు సంబంధించిన చాలా విభాగాల్లో మన వాళ్లకంటే బయటవాళ్లకే ఎక్కువ అవకాశాలిస్తున్నారు. 
 
ఈ విషయాన్ని పక్కనపెడితే.. నటీనటుల సంక్షేమం కోసం.. వాళ్ల సమస్యల పరిష్కారం కోసం మనం ఏర్పాటు చేసుకున్న చిన్న సంస్థ ‘మా’. మన కోసం మనం పెట్టుకున్నాం. అలాంటి ఒక చిన్న సంస్థలో పనిచేయడానికి కూడా మనలో ఒకడు పనికిరాడా? దీనికి కూడా మనం బయట నుంచే మనుషులను తెచ్చుకోవాలా? ఇది మన సంస్థ.. మనం నడుపుకోలేమా? మనకి చేతకాదా? ఒక్కసారి ఆలోచించండి’ అంటూ రవిబాబు కీలక వ్యాఖ్యలు చేశారు.