ఎవరో వచ్చి మన సమస్యలు పరిష్కరించాలాః రవిబాబు సూటి ప్రశ్న
మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ఎన్నికల సందర్భంగా దర్శకుడు రవిబాబు తన శైలిలో స్పందించారు. ఆయన మాట్లాడుతూ, ఇది లోకల్ నాన్ లోకల్ సమస్యకాదు. మన సినిమాలలో కేరెక్టర్ ఆర్టిస్టుల కోసం బయటవారిని తీసుకురావడం మామూలే. వారి డిమాండ్లను ఒప్పుకుని మరీ వారితో నటింపజేస్తారు. డబ్బులు ఎవరు పెడితే వారిష్టమే. కానీ మన తెలుగులో కేరెక్టర్ ఆర్టిస్టులు సూట్ కారా? బయటివారు అదృష్టమో, మన వారి దురదృష్టమో తెలీదు.
హైదరాబాద్ లోనే 200పైగా కెమెరామెన్‌లు పనిలేకుండా వున్నారు. ఏ సినిమా తీసినా బయట కెమెరామెన్‌లను తెస్తున్నారు. వారికి అసిస్టెంట్లు కూడా అక్కడివారే. దానికితోడు ఎక్కువ డబ్బులు ఇచ్చి తెచ్చుకుంటున్నారు. ఔట్‌డోర్ లో షూటింగ్ జరిగితే చివరగా వారి పెట్టే బిల్లు చూస్తే నిర్మాతలు తలబాదుకుంటున్న సందర్భాలు చాలా వున్నాయి. కానీ ఎందుకు తీసుకువస్తున్నారు? అనేది వారి ఇష్టం. ఇలాంటివి ఎన్నో సమస్యలు ఎదుర్కొన్న మనం చిన్న `మా` అసోసియేషన్ ఏర్పాటు చేసుకున్నాం. దానిద్వారా సమస్యలు పరిష్కరించుకోవాలనుకున్నాం. కానీ ఈ చిన్న ఆర్గనైజేషన్ కోసం బయట నుంచి మనిషిని తెచ్చుకోవాలా. మన ఆర్గనైజేషన్‌ను మనం నడుపుకోలేమా? కొంచెం ఆలోచించండి. అంటూ రవిబాబు సూటిగా ప్రశ్నిస్తున్నారు మా సభ్యులను. ఈనెల 10న`మా` ఎన్నికలు జరగనున్నాయి.