ఆస్కార్ నామినేషన్స్ 2026 జాబితా ఇదే.. ఇండియన్ మూవీలకు దక్కని చోటు
ప్రపంచ వ్యాప్తంగా సినీ ప్రియులు అమితాసక్తితో ఎదురు చూస్తున్న 2026 సంవత్సరానికిగాను ఆస్కార్ నామినేషన్స్ జాబితాను గురువారం విడుదల చేశారు. ఈ యేడాది అవార్డుల కోసం పోటీ పడుతున్న చిత్రాల జాబితాను ఆస్కార్ అకాడెమీ ప్రకటించింది. ఇందులో ఒక్కటంటే ఒక్క భారతీయ చిత్రం కూడా లేకపోవడం గమనార్హం.
కాగా, 2025లో విడుదలై వివిధ విభాగాల్లో అద్భుత ప్రతిభను కనబరిచిన చిత్రాలు షార్ట్ లిస్ట్ అయి ఇప్పటికే అకాడమీ ముందుకు వచ్చాయి. వీటిలో విశేష ఆదరణ సొంతం చేసుకున్న చిత్రాలు, అందులోని నటీనటులు, సాంకేతిక నిపుణులను ఎంపిక చేసి అవార్డుల కోసం పోటీపడుతున్న వారి జాబితాను అకాడమీ ప్రకటించింది.
ఉత్తమ చిత్రం కేటగిరిలో అత్యధికంగా 10 చిత్రాలు పోటీ పడుతుండటం విశేషం. రేయాన్ కూగ్లర్ దర్శకత్వంలో రూపొందిన సిన్నర్స్ అత్యధికంగా 16 కేటగిరిల్లో నామినేషన్స్ దక్కించుకుంది. ఇప్పటివరకూ 14 నామినేషన్స్‌తో ఆల్ అబౌట్ ఈవ్, టైటానిక్, లా లా ల్యాండ్ పేరిట ఈ రికార్డు ఉండేది. సిన్నర్స్ దానిని బద్దలు కొట్టింది.
ఈ మూవీ తర్వాత వన్ బ్యాటిల్ ఆఫ్టర్ అనదర్కు ఎక్కువ నామినేషన్స్ దక్కాయి. ఇక ఈ ఏడాది కొత్తగా క్యాస్టింగ్ డైరెక్టర్ కేటగిరిని అవార్డుల విభాగంలో చేర్చారు. సిన్నర్స్లో నటనకుగానూ 73 ఏళ్ల డెల్రోయ్ లిండో తొలిసారి ఆస్కార్‌కు నామినేట్ అయ్యారు. ఈ నామినేషన్స్ ప్రకటన కార్యక్రమానికి నటుడు డానియల్ బ్రూక్స్, లూయిస్ పుల్‌మన్ వ్యాఖ్యాతలుగా వ్యవహరించారు. మార్చి 15వ తేదీన ఆస్కార్ అవార్డుల ప్రదానోత్సవం జరగనుంది.