రీల్ హీరో కాదు... రియల్ లైఫ్‌లోనూ హీరోనే..: టైగర్ ష్రాఫ్‌పై నెట్టింట ప్రశంసలు
బాలీవుడ్ నటుడు టైగర్ ష్రాఫ్‌పై జరిగిన కాల్పుల దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. కాల్పుల అనంతరం టైగర్ ష్రాఫ్ ధైర్యంగా వ్యవహరించడంపై ఇప్పుడు సోషల్ మీడియాలో ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి. దాడి జరిగిన తర్వాత ఆయన ఏమాత్రం ఆలస్యం చేయకుండా గాయపడిన డ్రైవర్‌ను కాపాడారు. పోలీసుల కోసం ఎదురుచూడకుండా డ్రైవర్‌ను తన సీట్‌లో కూర్చోబెట్టి తానే స్వయంగా కారు నడుపుతూ ఆసుపత్రికి తీసుకెళ్లారు.
ఆ సమయంలో టైగర్ చూపించిన ధైర్యంపై నెటిజన్లు ప్రశంసలు కురిపిస్తున్నారు. సినిమాల్లోనే కాదు.. నిజ జీవితంలోనూ హీరో అనిపించుకున్నాడని కొనియాడుతూ పోస్ట్‌లు పెడుతున్నారు. మరోవైపు ఆ దాడిలో టైగర్ క్షేమంగా బయటపడ్డారని నటుడి తండ్రి జాకీ ష్రాఫ్ తెలిపారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు నిందితుల ఆచూకీ కోసం 12 ప్రత్యేక బృందాలను రంగంలోకి దించి గాలింపు చర్యలు చేపట్టారు.
మరోవైపు, దాడి అనంతరం టైగర్ ష్రాఫ్ ఇంటికి దిశా పటానీ వెళ్లారు. మీడియాతో మాట్లాడేందుకు నిరాకరించిన దిశా.. ఆందోళనగా నటుడి ఇంట్లోకి వెళ్లారు. వీరిద్దరూ రిలేషన్‌లో ఉన్నట్లు కొన్నిరోజులుగా వార్తలు వస్తున్నాయి. బాఘీ 2, బేఫిక్రే వంటి చిత్రాలలో కలిసి నటించారు. డిన్నర్ డేట్స్, విహారయాత్రలు, బహిరంగ కార్యక్రమాలకు జంటగా వెళ్తూ ఈ మధ్య తరచు వార్తల్లో నిలుస్తున్నారు.
ఇక గతేడాది సెప్టెంబర్‌లో దిశా పటానీ ఇంటి ముందు కాల్పులు జరిగిన విషయం తెలిసిందే. ఓ వర్గం మనోభావాలు దెబ్బతీసేలా దిశా సోదరి ఖుష్బూ పటానీ వ్యాఖ్యలు చేశారని అందుకే కాల్పులు జరిగినట్లు వార్తలు వచ్చాయి. అయితే ఈ కేసులో ఆరోపణలు ఎదుర్కొన్న ఇద్దరు నిందితులు యూపీ పోలీసుల ఎన్‌కౌంటర్‌లో హతమయ్యారు.

