1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
  4. After Akvan, another cyclonic circulation brewing in Bay: IMD

దక్షిణ అండమాన్ తీరంలో మరో తుఫాను... 27 నుంచి విస్తారంగా వర్షాలు

Cyclone formation
దక్షిణ అండమాన్ సముద్రం, ఆగ్నేయ బంగాళాఖాతం పరిసరాల్లో నవంబరు నెలాఖరులో ఒక ఉపరితల ఆవర్తనం ఏర్పడే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ (ఐఎండీ) అంచనా వేసింది. అయితే దీనిపై తీర ప్రాంత ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, ప్రస్తుతానికి ఎలాంటి తుఫాను హెచ్చరికలు జారీ చేయలేదని వాతావరణ నిపుణులు స్పష్టం చేశారు.
 
అయితే, విశాఖపట్నం తుఫాను హెచ్చరికల కేంద్రం డైరెక్టర్ పి.ఎల్.ఎన్.మూర్తి మాట్లాడుతూ, నవంబరు 27వ తేదీ నుంచి డిసెంబరు 2వ తేదీ మధ్య కాలంలో దక్షిణ అండమాన్ సముద్ర ప్రాంతంలో ఉపరితల ఆవర్తనం ఏర్పడే అవకాశాలు ఉన్నాయని, ఇది క్రమంగా బలపడి అల్పపీడనంగా మారే ఛాన్స్ ఉందని తెలిపారు. 
 
అయితే, ఇది మరింత బలపడి వాయుగుండంగా మారుతుందా లేదా అనే అంశంపై ఇంకా ఎలాంటి స్పష్టత రాలేదని, ఒకవేళ బలపడినా కూడా, అది శ్రీలంక తమిళనాడు తీరం వైపు పయనించే అవకాశాలే ఎక్కువగా ఉన్నాయని, ఆంధ్రప్రదేశ్ వైపు వస్తుందని చెప్పలేమని ఆయన వివరించారు. దీని తీవ్రత, ప్రయాణించే మార్గానికి సంబంధించి ఐఎండీ ఇంకా ఎలాంటి అధికారిక ప్రకటన చేయలేదని తెలిపారు.
 
సాధారణంగా ఉపరితల ఆవర్తనం అనేది వాతావరణ వ్యవస్థలలో అత్యంత ప్రాథమిక దశ మాత్రమేనని, ఇలా ఏర్పడే ప్రతి ఆవర్తనం తుఫానుగా మారదని నిపుణులు స్పష్టం చేస్తున్నారు. నవంబరు 27 తర్వాత అల్పపీడనం ఏర్పడిన అనంతరమే దీని తదుపరి కదలికలపై ఒక అంచనాకు వచ్చే అవకాశం ఉంటుంది. 
 
మరోవైపు, ప్రస్తుతం దక్షిణ భారతదేశంలో కురుస్తున్న వర్షాలకు, నెలాఖరులో రాబోయే ఆవర్తనానికి ఎలాంటి సంబంధం లేదని ఐఎండీ స్పష్టం చేసింది. తూర్పు గాలుల (ఈస్టర్లీ వేవ్స్) ప్రభావంతో వచ్చే కొద్దిరోజులు పలు ప్రాంతాల్లో వర్షాలు కురుస్తాయని తెలిపింది. కోస్తా ఆంధ్రప్రదేశ్, యానాం, రాయలసీమ ప్రాంతాల్లో నవంబరు 22 నుంచి 28 వరకు అక్కడక్కడా తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది. 
 
ముఖ్యంగా నవంబరు 23 నుంచి 26 మధ్య ఉరుములు, మెరుపులతో పాటు గంటకు 40 నుంచి 60 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచే సూచనలు ఉన్నాయి. తమిళనాడు, పుదుచ్చేరిలలో నవంబరు 23 నుంచి 27 వరకు భారీ వర్షాలు, కేరళలో నవంబరు 24 నుంచి 26 వరకు అక్కడక్కడా భారీ వర్షాలు పడవచ్చు. అండమాన్ నికోబార్ దీవుల్లో రాగల రెండు రోజుల పాటు విస్తారంగా వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. 
About Writer
ఠాగూర్
ఠాగూర్ పులపాక ప్రముఖ దినపత్రిక ఈనాడు, చెన్నై కార్యాలయంలో 'న్యూస్ కాంట్రిబ్యూటర్‌'గా జర్నలిజం ఓనమాలు నేర్చుకున్నారు. హైదరాబాద్ కార్యాలయంలో 'ఆంధ్రజ్యోతి' సబ్-ఎడిటర్ పని చేశారు. 2007 నుంచి 'వెబ్ దునియా'లో అసిస్టెంట్ ఎడిటర్‌‌గా విధులు నిర్వహిస్తున్నారు..... మరింత చదవండి
తర్వాతి కథనం
తల్లి - చెల్లిని బెంగుళూరు రోడ్లపై నిలబెట్టిన జగన్.. కోర్టు ఆదేశాలతో (వీడియో)