1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
  4. AP Municipal Election Results Today: Counting Begins

ఏపీలో ఉత్కంఠ వాతావరణం - నేడు మున్సిపల్ ఓట్ల లెక్కింపు

vote
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉత్కంఠ వాతావరణం నెలకొనివుంది. ఒక వైపు అర్నబ్, మురసు తుఫాన్లు సృష్టించిన బీభత్సం నుంచి ప్రజలు క్రమగా కోలుకుంటున్నారు. మరోవైపు, మంగవారం ఉదయం నుంచి మున్సిపల్ ఎన్నికల ఓట్ల లెక్కింపు మొదలైంది. దీంతో గెలుపు ఓటములపై పోటీ చేసిన అభ్యర్థులతో పాటు వారి అనుచరులు, పార్టీ శ్రేణుల్లో ఉత్కంఠ నెలకొంది. 
 
రాష్ట్రవ్యాప్తంగా 92 పట్టణ స్థానిక సంస్థలకు జరిగిన ఈ ఎన్నికల ఫలితాలు రాత్రి 8 గంటల కల్లా వెలువడే అవకాశం ఉంది. ఇందుకోసం రాష్ట్ర ఎన్నికల సంఘం (ఎస్ఈసీ) 138 కౌంటింగ్ కేంద్రాలను సిద్ధం చేసింది. 13 మున్సిపల్ కార్పొరేషన్లు, 79 మున్సిపాలిటీలు, నగర పంచాయతీల్లోని మొత్తం 3,186 వార్డులకు నవంబరు 1న పోలింగ్ జరిగింది. ఇందులో కార్పొరేషన్లలో 804, మున్సిపాలిటీలు/నగర పంచాయతీలలో 2,382 వార్డులు ఉన్నాయి. ఈ ఎన్నికల్లో 96,89,061 మంది ఓటర్లకు గాను 60,22,411 మంది (62.16 శాతం) తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు.
 
ఓట్ల లెక్కింపు ప్రక్రియ కోసం ఎన్నికల సంఘం పటిష్ట ఏర్పాట్లు చేసింది. మొత్తం 556 కౌంటింగ్ హాళ్లు, 6,831 టేబుళ్లను ఏర్పాటు చేసి, 47,817 మంది సిబ్బందిని నియమించింది. అత్యధికంగా గ్రేటర్ విశాఖపట్నం మున్సిపల్ కార్పొరేషన్‌కు 10 కేంద్రాల్లో లెక్కింపు జరగనుంది. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా స్ట్రాంగ్ రూమ్లు, కౌంటింగ్ కేంద్రాల వద్ద 1,372 సీసీటీవీ కెమెరాలను ఏర్పాటు చేశారు. మొత్తం ప్రక్రియను వీడియో రికార్డింగ్ చేస్తున్నారు. ముందుగా పోస్టల్ బ్యాలెట్లను లెక్కించి, ఆ తర్వాత బ్యాలెట్ పత్రాలను 25 చొప్పున కట్టలు కట్టి లెక్కింపు చేపడతారు.
 
ఈ ఎన్నికల్లో అధికార టీడీపీ - జనసేన - బీజేపీ కూటమి, ప్రతిపక్ష వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ మధ్య హోరాహోరీ పోరు నెలకొంది. కొత్త చట్ట సవరణల ప్రకారం మేయర్లు, ఛైర్‌పర్సన్లను నేరుగా ఎన్నుకోవడంతో ఈ ఫలితాలపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. మేయర్, చైర్‌పర్సన్‌ పదవులకు 520 మంది, వార్డులు, డివిజన్ స్థానాలకు 10 వేల మందికి పైగా బరిలో నిలిచారు. 
 
కొన్ని చోట్ల ఫిర్యాదుల నేపథ్యంలో రీపోలింగ్ నిర్వహించారు. లెక్కింపు ప్రక్రియ ప్రశాంతంగా, పారదర్శకంగా జరిగేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామని రాష్ట్ర ఎన్నికల కమిషనర్ అనిల్ చంద్ర పునేఠా తెలిపారు. లెక్కింపు పూర్తయిన వెంటనే సంబంధిత రిటర్నింగ్ అధికారులు ఫలితాలను ప్రకటిస్తారని ఆయన వెల్లడించారు. 
About Writer
ఠాగూర్
ఠాగూర్ పులపాక ప్రముఖ దినపత్రిక ఈనాడు, చెన్నై కార్యాలయంలో 'న్యూస్ కాంట్రిబ్యూటర్‌'గా జర్నలిజం ఓనమాలు నేర్చుకున్నారు. హైదరాబాద్ కార్యాలయంలో 'ఆంధ్రజ్యోతి' సబ్-ఎడిటర్ పని చేశారు. 2007 నుంచి 'వెబ్ దునియా'లో అసిస్టెంట్ ఎడిటర్‌‌గా విధులు నిర్వహిస్తున్నారు..... మరింత చదవండి
తర్వాతి కథనం
Cyclone Murasu: నవంబర్ 5 వరకు భారీ వర్షాలు.. 110 కిలోమీటర్ల వేగంతో గాలులు