1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
  4. Drinking Water Shortage on Tirumala

ఎల్‌నినో ఎఫెక్ట్.. గోగర్భంలో తగ్గిన నీరు.. తిరుమలలో నీటి కొరత తప్పదా?

pond water
ఎల్‌నినో ప్రభావం కారణంగా తిరుమల కొండపై ఉన్న గోగర్భంలో నీటి నిల్వలు గణనీయంగా తగ్గిపోయాయి. దీంతో తిరుమలలో నీటి కొరత ఏర్పడే ప్రమాదం పొంచివుంది. ఒకవైపు ఎల్‌నినో ప్రభావం, మరోవైవు, ఉష్ణోగ్రతలు పెరగిపోతున్నాయి. దీంతో వర్షాలు అంతంతమాత్రంగానే కురుస్తున్నాయి. ఈ కారణంగా రిజర్వాయర్లలో నీటి నిల్వలు గణనీయంగా అడుగంటిపోతున్నాయి. 
 
ఈ నేపథ్యంలో లక్షలాది మంది భక్తులు తరలివచ్చే తిరుమలలో నీటి సరఫరా వినియోగంపై తిరుమల తిరుపతి దేవస్థానం వాటర్ వర్క్స్ విభాగం దృష్టిసారించింది. గతంలో సెలవు దినాల్లోనే రద్దీ నెలకొనేది.. ఇటీవల పనిదినాలతో సంబంధం లేకుండా భక్తులు భారీగా తరలివస్తున్నారు. నీటి వినియోగం సైతం అదే స్థాయిలో ఉంటోంది.
 
కొండపై 7500 అద్దెగదులు, ఐదు యాత్రికుల వసతి సముదాయాలు, మరుగుదొడ్లు, ఇతర వాటికి ప్రతిరోజూ సుమారు 60 లక్షల గ్యాలన్ల నీటిని వినియోగిస్తున్నారు. ఇందులో పాపవినాశనం డ్యామ్ నుంచి 15 లక్షల గ్యాలన్లు, గోగర్భం నుంచి 15 లక్షల గ్యాలన్లు, తిరుపతిలోని కల్యాణిడ్యామ్ నుంచి 30 లక్షల గ్యాలన్లను పంపింగ్ ద్వారా తిరుమలకు తరలిస్తున్నారు. 
 
కొండపైనున్న పాపవినాశనం, ఆకాశ గంగ, గోగర్భం డ్యామ్, కుమారధార, పసుపుధార డ్యామ్ల నుంచి నీటి సరఫరా జరుగుతోంది. వీటిలో కుమారధార, పసుపుధార నీటి మట్టం పూర్తిగా అడుగంటి పోయింది. ప్రస్తుతానికి పాపవినాశనం, గోగర్భం డ్యామ్‌లో కొద్దిగా నిల్వలున్నాయి. ఇవి 90 రోజులకు మాత్రమే సరిపోతాయని తితిదే వాటర్ వర్క్స్ ఇంజినీరింగ్ అధికారులు తెలుపుతున్నారు. వారం రోజుల్లో వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ నుంచి సమాచారం అందిందని.. సాధారణంగా తిరుమలలో ఏడాది చివరలో భారీ వర్షాలు కురుస్తాయని ఓ అధికారి తెలిపారు. 
About Writer
ఠాగూర్
ఠాగూర్ పులపాక ప్రముఖ దినపత్రిక ఈనాడు, చెన్నై కార్యాలయంలో 'న్యూస్ కాంట్రిబ్యూటర్‌'గా జర్నలిజం ఓనమాలు నేర్చుకున్నారు. హైదరాబాద్ కార్యాలయంలో 'ఆంధ్రజ్యోతి' సబ్-ఎడిటర్ పని చేశారు. 2007 నుంచి 'వెబ్ దునియా'లో అసిస్టెంట్ ఎడిటర్‌‌గా విధులు నిర్వహిస్తున్నారు..... మరింత చదవండి
తర్వాతి కథనం
విమానంలో హాలీవుడ్ నటి వీరంగం - ఫ్లైట్ అటెండెంట్‌ను కొట్టి కొరికింది..