గురువారం, 19 ఫిబ్రవరి 2026
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఠాగూర్
Last Updated : బుధవారం, 14 జనవరి 2026 (13:12 IST)

కారుతో బీభత్సం కేసు : రౌడీ షీటర్లకు ఖాకీ మార్క్ ట్రీట్మెంట్

police treatment to rowdys
పీకల వరకు మద్యం సేవించి కారుతో బీభత్సం సృష్టించిన కేసులో నలుగురు రౌడీలను పోలీసులు అరెస్టు చేశారు. వీరికి తమదైనశైలిలో ఖాకీ మార్క్ ట్రీట్మెంట్ ఇచ్చారు. ఈ రౌడీలను కాళ్లకు చెప్పులు లేకుండా ఏకంగా ఆరు కిలోమీటర్ల దూరం నడిపించారు. ఈ ఘటన విజయవాడ నగరంలోని భవానీపురంలో వెలుగులోకి వచ్చింది. ఈ వివరాలను పరిశీలిస్తే, 
 
మద్యం మత్తులో కారును నిర్లక్ష్యంగా నడిపి బీభత్సం సృష్టించిన కేసులో అరెస్టు అయిన రౌడీషీటర్లు సహా నలుగురికి పోలీసులు తమ మార్కు ట్రీట్‌మెంట్‌ ఇచ్చారు. ఆదివారం రాత్రి అతివేగంగా కారుతో రౌండ్లు వేస్తుండడంతో పాటు అదేమని అడిగిన వారిపైకి కారును నడిపి గాయాలపాలు చేసిన వారిని పోలీసులు అరెస్టు చేశారు. ఆ సమయంలో కారులో ఉన్న ఐదుగురిలో నలుగురిని అరెస్టు చేశారు. 
 
మాజీ రౌడీషీటర్‌ దినేష్‌ పరారవడంతో అతని కోసం ప్రత్యేక బృందాలు గాలిస్తున్నాయి. అరెస్టు అయిన నలుగురిని మంగళవారం మధ్యాహ్నం నగరంలోని భవానీపురం చర్చిసెంటర్‌ నుంచి రాఘవయ్య పార్క్‌ వరకు రోడ్డుపై చెప్పులు లేకుండా 6 కి.మీ మేర నడిపించుకుని తీసుకెళ్లారు.
 
ఈ నెల 11వ తేదీన భవానీపురంలోని బబ్బూరి మైదానం వద్ద రౌడీషీటర్లు కొండా యోహోవా అలియాస్‌ పెద్ద చిచ్చా, కొండా రమేష్‌ అలియాస్‌ చిన్న చిచ్చా, అతని స్నేహితులు వెంకట భార్గవ్‌ రామ్‌ సింగ్‌ అలియాస్‌ భార్గవ్, వీర్ల మహేష్, దినేష్‌లు మద్యం తాగి వేరొకరి కారును నడుపుతూ అరాచకం సృష్టించారు. పెద్ద చిచ్చాపై వివిధ స్టేషన్లలో 18 కేసులు, చిన్న చిచ్చాపై 42 కేసులు ఉన్నాయి. వీరిద్దరిపై రెండో పట్టణ స్టేషన్‌లో రౌడీషీట్లు ఉన్నాయి. 
 
దినేష్‌పై రౌడీషీట్‌ ఉన్నప్పటికీ హైకోర్టు ఆదేశాల మేరకు గతేడాది నవంబరులో పోలీసులు తొలగించారు. పెద్ద చిచ్చా కారును వేగంగా నడుపుతూ చక్కర్లు కొడుతూ రిహాన్‌ పఠాన్‌ఖాన్‌(9) అనే బాలుడితో పాటు మరో ముగ్గురిని ఢీకొట్టాడు. ఈ ఘటనలో బాలుడి తలకు తీవ్రగాయమై విజయవాడలోని ఆంధ్రా ఆసుపత్రిలో వెంటిలేటర్‌పై చికిత్స పొందుతున్నాడు. భవానీపురం పోలీసులు విచారణ చేసి పెద్ద చిచ్చా, చిన్న చిచ్చా, భార్గవ్, మహేష్‌లను అదుపులోకి తీసుకున్నారు.