మేకిన్ ఇండియాకు పునాదిరాయి వేసిన ఇస్రో
ప్రధాని నరేంద్ర మోడీ మేకిన్ ఇండియా నినాదానికి ఇస్రో పునాదిరాయి వేసింది. 5 పీఎస్ఎల్వీ రాకెట్లను తయారు చేసేందుకు మన దేశ కంపెనీలకు ఆహ్వానం పలికింది. ఇస్రో ఛైర్మన్ కె.శివన్ ఆ వివరాలను వెల్లడించారు.
'ఇంట్రెస్ట్ ఉన్న కంపెనీలు బిడ్స్ వేయాల్సిందిగా (ఎక్స్ప్రెషన్ ఆఫ్ ఇంట్రెస్ట్-ఈవోఐ) కోరాం. విదేశీ కంపెనీలకు ఇందులో చోటు లేదు. ప్రభుత్వం చేపట్టిన మేకిన్ ఇండియా కార్యక్రమానికి ఇది మరింత బలమిస్తుందని భావిస్తున్నాం' అని అన్నారు. ఒక్కో రాకెట్ తయారీకి రూ.200 కోట్ల దాకా ఖర్చవుతుందని, బిడ్లు వేసే కంపెనీల్లో ఒక్కదానికి వెయ్యి కోట్ల ఆర్డర్ దక్కుతుందని విక్రమ్ సారాభాయ్ స్పేస్ సెంటర్ సీనియర్ అధికారి ఒకరు చెప్పారు.
ఆర్డర్ దక్కించుకునే కంపెనీకి టెక్నాలజీ ట్రాన్స్ఫర్ బాధ్యతలను ఇస్రో కొత్తగా పెట్టిన న్యూ స్పేస్ ఇండియా లిమిటెడ్ చూసుకుంటుంది.
హాల్, ఎల్అండ్ టీ కన్సార్టియంగా వస్తే.. 'మన దేశంలో హాల్, ఎల్ అండ్ టీ వంటి కంపెనీలు ఇప్పటికే పీఎస్ఎల్వీ రాకెట్ తయారీలో భాగస్వాములయ్యాయి. జనవరిలో ఆ రెండు కంపెనీలూ ఇస్రోతో ఒప్పందం చేసుకున్నాయి. అవి కన్సార్టియంగా మారి ఈ ప్రాజెక్ట్‌ను చేపడతాయని ఆశిస్తున్నా. కన్సార్షియంగా మారిన కంపెనీలే ఈవోఐకి రావాల్సిందిగా ఎన్ఎస్ఎల్ఐ రూల్ కూడా పెట్టింది. సెప్టెంబరు ఆరో తేదీ నాటికి ఈవోఐలు వస్తాయనుకుంటున్నాం. గోద్రెజ్, కొన్ని చిన్న కంపెనీలూ ఈవోఐలపై ఆసక్తి చూపిస్తున్నాయి' అని శివన్ చెప్పారు.
ఒక్కో పీఎస్ఎల్వీ లాంచ్ అయినప్పుడు అందులో 150 చిన్నా పెద్ద కంపెనీలు భాగస్వాములవుతున్నాయన్నారు. పీఎస్ఎల్వీ, జీఎస్ఎల్వీ రాకెట్లకు సంబంధించి సీఈ-20 క్రయోజెనిక్ ఇంజన్లను హాల్ తయారు చేస్తుంటుంది. ఇప్పటిదాకా హాల్‌కు 24 సెట్ల పీఎస్ఎల్వీ, రెండు సెట్ల జీఎస్ఎల్వీ ఆర్డర్లు ఇచ్చామన్నారు. పీఎస్ఎల్వీ ఎస్139 సాలిడ్ ఇంజన్లను ఎల్అండ్ టీ తయారు చేస్తోంది. కాగా, ఇస్రో నిర్ణయం స్వాగతించదగినదని, ఇస్రో కోసం ఉపగ్రహాలు తయారు చేస్తున్న ఆల్ఫా డిజైన్ అనే కంపెనీ సీఎండీ కల్నల్ హెచ్ఎస్ శంకర్ అన్నారు. ప్రైవేట్ కంపెనీలకు మార్కెట్‌ను ఓపెన్ చేయడం మంచిదన్నారు.