శనివారం, 23 నవంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By
Last Updated : ఆదివారం, 18 ఆగస్టు 2019 (12:57 IST)

మార్పు దిశగా అడుగులేస్తున్నాం.. సహకరిస్తున్నాం : జగన్

రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టాలని ప్రవాసాంధ్రులను ఏపీ సీఎం వైఎస్ జగన్ కోరారు. పెట్టుబడులు పెట్టే వారు ప్రభుత్వం ఏర్పాటు చేసే వెబ్‌సైట్‌లో సమాచారం ఇస్తే ప్రభుత్వం అన్ని రకాల అనుమతులను మంజూరు చేస్తోందని ఆయన చెప్పారు. 
 
అమెరికా పర్యటనలో భాగంగా డల్లాస్‌లోని హచిన్‌సన్ కన్వెన్షన్ సెంటర్‌లో ప్రవాసాంధ్రులతో ఏపీ సీఎం జగన్ సమావేశమయ్యారు. ఏపీ రాష్ట్రంలో తమ ప్రభుత్వం ఏర్పాటు కావడంలో ప్రవాసాంధ్రుల పాత్ర ఉన్న విషయాన్ని ఆయన గుర్తు చేశారు. 
 
వివక్షలేని పాలన అందించాలనేది తన కల అని ఆయన చెప్పారు. రాష్ట్రంలో పారిశ్రామికీకరణ దిశగా అడుగులు వేస్తున్నామని సీఎం జగన్ తెలిపారు. మూడు నెలల్లో నాలుగున్నర లక్షల ఉద్యోగాలు కల్పించినట్టుగా జగన్ చెప్పారు. 
 
దేశంలో ఏ రాష్ట్రంలో అమలు చేయని విధంగా ప్రభుత్వ, ప్రైవేట్ సంస్థల్లో కూడ 50 శాతం రిజర్వేషన్లను అమలు చేస్తున్నామని ఆయన గుర్తు చేశారు.
 
మార్పు అనేది నాయకత్వం నుంచి రావాల్సిన అవసరం ఉందన్నారు. అమెరికా అధ్యక్షుడు తెలుగువారిని పొగడడం తనకు ఆనందంగా ఉందన్నారు. రాష్ట్రంలో ప్రతి ఒక్కరికీ స్వంత ఇల్లు కట్టిస్తామన్నారు.
 
రాష్ట్రంలో అవినీతికి దూరంగా పాలన సాగిస్తున్నట్టుగా ఆయన తెలిపారు. రాష్ట్రంలో ప్రతి ఎకరానికి నీరు అందించడమే తన స్వప్నమని ఆయన చెప్పారు. రాష్ట్రంలో మార్పు దిశగా అడుగులు వేస్తున్నట్టుగా ఆయన వివరించారు. తమ ప్రభుత్వం చేపట్టనున్న కార్యక్రమాల గురించి ఆయన ఈ సమావేశంలో ప్రస్తావించారు.