జగన్ సర్కారుకు ఎన్జీటీ షాక్ ... పోలవరం తర్వాత పురుషోత్తపట్నంపై ఆంక్షలు

national green tribunal
ఎం| Last Updated: మంగళవారం, 13 ఆగస్టు 2019 (16:49 IST)
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వానికి ఎన్జీటీ మరో షాక్ ఇచ్చింది. పర్యావరణ అనుమతులు లేకుండా ఏపీలో నిర్మిస్తున్న ఎత్తిపోతల పథకాలను ఆపాలంటూ నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ ఆదేశాలు జారీ చేసింది.

గోదావరి, పెన్నా నదుల అనుసంధానం, పురుషోత్తపట్నం - చింతలపూడి ఎత్తిపోతల పథకాలను ఆపేయాలంటూ ఆదేశాలు జారీ చేసింది. పర్యావరణ అనుమతులు తీసుకున్నాకే ఆ ప్రాజెక్టుల పనులు కొనసాగించాలని సూచించింది.

ఇకపోతే రాష్ట్రంలో ఎత్తిపోతల పథకాలపై కేంద్రం నియమించిన జాయింట్ కమిటీ నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్‌కు నివేదిక అందజేసింది. నివేదిక ఆధారంగా ప్రాజెక్టులు ఆపేయాలంటూ ఆదేశాలు జారీ చేశారు.


మరోవైపు అనుమతులు లేకుండా ఎత్తిపోతల పథకాలు చేపడుతున్నారంటూ మాజీమంత్రి, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత వట్టి వసంతకుమార్, శ్రీనాథ్ రెడ్డి ఫిటిషన్లు వేశారు. ఈ ఫిటిషన్‌పై స్పందించిన ఎన్జీటీ ఈ మేరకు ఆదేశాలు జారీ చేసింది.

ఇకపోతే ఈనెల 7న పోలవరం ప్రాజెక్టుపై కూడా నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ ఆంక్షలు విధించింది. పోలవరం విషయంలో ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వానికి కేంద్రం షోకాజ్‌ నోటీసులు జారీ చేసింది.

పర్యావరణ అనుమతుల్ని ఉల్లంఘినట్లు కేంద్రం స్పష్టం చేస్తూ షోకాజ్ నోటీసులు జారీ చేసింది. పర్యావరణ అనుమతులు ఎందుకు రద్దు చేయకూడదని ప్రశ్నించింది. పురుషోత్తపట్నం ప్రాజెక్టుపై కూడా కేంద్రం వివరణ కోరింది.

ప్రాజెక్టు నిర్మాణంలో పర్యావరణ అనుమతుల్ని ఉల్లంఘించారంటూ పర్యావరణ శాఖ అధికారులు కేంద్రానికి నివేదిక సమర్పించారు. దాంతో పోలవరం, దాని అనుబంధ ప్రాజెక్టులపై కేంద్ర పర్యావరణ శాఖ తనిఖీలు నిర్వహించింది.దీనిపై మరింత చదవండి :