1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
  4. ISRO to launch RISAT-2BR1 from Sriharikota on May 22

రీశాట్-2బీ శాటిలైట్ ప్రయోగానికి కౌంట్‌డౌన్

ISRO
దేశ సరిహద్దుల్లో ఉగ్రవాద స్థావరాలు, తీవ్రవాదుల కదలికలపై నిశిత దృష్టి సారించే రీశాట్‌-2బీ ఉపగ్రహ ప్రయోగం బుధవారం వేకువజామున చేపట్టనున్నారు. నెల్లూరు జిల్లా శ్రీహరికోటలోని షార్‌ కేంద్రంలో ప్రథమ ప్రయోగ వేదిక నుంచి బుధవారం తెల్లవారుజామున 5.30 గంటలకు ఈ ఉపగ్రహంతో పీఎస్‌ఎల్వీ-సీ46 రాకెట్‌ నింగిలోకి దూసుకుపోనుంది. 
 
ఈ ప్రయోగానికి సంబంధించిన రిహార్సల్స్‌‌ను ఇస్రో శాస్త్రవేత్తలు ఇప్పటికే విజయవంతంగా పూర్తిచేశారు. సోమవారం మధ్యాహ్నం షార్‌లో మిషన్‌ రెడీనెస్‌ రివ్యూ ఛైర్మన్‌ బీఎన్‌ సురేష్‌ ఆధ్వర్యంలో జరిగిన సమావేశంలోనూ, రాత్రి లాంచ్‌ ఆథరైజేషన్‌ బోర్డు ఛైర్మన్‌, షార్‌ డైరెక్టర్‌ పాండియన్‌ ఆధ్వర్యంలో జరిగిన సమావేశంలోనూ రాకెట్‌ ప్రయోగానికి శాస్త్రవేత్తలు సంసిద్ధత వ్యక్తంచేశారు. 
 
రీశాట్‌-2బీ ఉపగ్రహంలో ఉన్న ఎక్స్‌బాండ్‌ రాడార్‌ దేశ సరిహద్దులను అనుక్షణం పహారా కాస్తూ ఉగ్రవాద శిబిరాలు, వారి కదలికలను ఎప్పటికప్పుడు పసిగడుతూ ఛాయాచిత్రాలు సహా సమాచారాన్ని అందజేయనుంది. అలాగే పనిలో పనిగా దేశవ్యవసాయ, అటవీ రంగాలపై సమగ్ర సమాచారాన్నీ అందించనుంది. ప్రకృతి వైపరీత్య సమయాల్లో సహాయకారిగా నిలవనుంది. ఈ ఉపగ్రహం ఐదేళ్ల పాటు పని చేసేలా ఇస్రో రూపొందించింది.
తర్వాతి కథనం
ఎన్నికల పనితీరు భేష్ : ప్రణబ్ ముఖర్జీ