సోమవారం, 9 మార్చి 2026
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By సెల్వి
Last Updated : బుధవారం, 4 మార్చి 2026 (10:30 IST)

Leopard Kills Deer: అలిపిరి టోల్ గేట్ వద్ద చిరుతపులి... జింకను చంపేసింది..

Leopard
Leopard
తిరుమల సమీపంలోని అలిపిరి టోల్ గేట్ వద్ద చిరుతపులి కనిపించడంతో, టిటిడి విజిలెన్స్ అధికారులు నడకదారి వెంట భక్తుల భద్రతను నిర్ధారించడానికి అప్రమత్తంగా ఉన్నారు. టోల్ గేట్ సమీపంలో చిరుతపులి ఒక జింకను చంపింది. భక్తుల నుండి సమాచారం అందుకున్న అటవీ శాఖ అధికారులతో కలిసి విజిలెన్స్ సంఘటన స్థలానికి చేరుకుని జింకను పశువైద్యశాలకు తరలించారు. ఈ సంఘటనతో అధికారులు చిరుతను పట్టుకోవడానికి గస్తీని ముమ్మరం చేశారు.
 
కొద్ది రోజులుగా తిరుపతి- తిరుమల మెట్ల మార్గంలో చిరుత కనిపించడం పరిపాటిగా మారింది. ఇదివరకు అలిపిరి నడక దారిలో చిరుత సంచరించిన సంగతి తెలిసిందే. 350వ మెట్టు సమీపంలో, అలిపిరి- శ్రీ వేంకటేశ్వర జూ పార్క్ మార్గంలో, శ్రీవేంకటేశ్వర యూనివర్శిటీ క్యాంపస్ ఆవరణలో అది సంచరించింది. వీటికి సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. 
 
ఈ తెల్లవారు జామున అలిపిరి టోల్ గేట్ వద్ద చిరుత సంచారం కనిపించింది. సమీప పొదల్లో ఓ జింక కళేబరాన్ని శ్రీవారి భక్తులు గుర్తించారు. ఈ విషయాన్ని టీటీడీ అటవీ విభాగం సిబ్బంది తెలియజేశారు. చిరుత దాడి చేయడం వల్లే జింక మరణించినట్లు ప్రాథమికంగా నిర్ధారించారు. దీని కదలికపై నిఘా పెట్టారు. 
 
అలిపిరి కాలినడక మార్గంతో పాటు వివిధ ప్రాంతాల్లో ఇదివరకే అమర్చిన సీసీటీవీ కెమెరాల ద్వారా చిరుత సంచారాన్ని పసిగడుతున్నారు. సీసీటీవీ ఫుటేజీని నిశితంగా పరిశీలిస్తోన్నారు. ప్రస్తుతానికి ఇది అలిపిరి పరిసర ప్రాంతాల్లోనే తిరుగాడుతుండొచ్చనే నిర్ధారణకు వచ్చారు. కాలినడకన తిరుమలకు రాకపోకలు సాగిస్తోన్న భక్తులకు జాగ్రత్తలను సూచించారు.