బుధవారం, 8 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఎంజీ
Last Updated : శనివారం, 25 సెప్టెంబరు 2021 (21:40 IST)

నార్కోటిక్స్ తో ఎటువంటి ప్రమాదమూ లేదు: ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి

ఆంధ్రప్రదేశ్ కు నార్కోటిక్స్ తో ఎటువంటి ప్రమాదమూ లేదని, ఉన్న ప్రమాదమంతా నారా అండ్ కో ట్రిక్స్ తోనే ఉందని వైసీపీ ఎమ్మెల్యే మండిపడ్డారు. ఆయన శనివారం విలేకరులతో మాట్లాడుతూ ఇంకేమన్నారంటే...!
 
1- ఆంధ్రప్రదేశ్ కు నార్కోటిక్స్ తో ఎటువంటి ప్రమాదమూ లేదు. ఉన్న ప్రమాదమంతా నారా అండ్ కో ట్రిక్స్ తోనే ఉంది. కేంద్ర ఏజెన్సీ మాటలను కూడా వీళ్లు తప్పుదోవ పట్టించేలా కార్యక్రమం చేస్తున్నారంటే టీడీపీ నేతలు ఏ స్థాయికి దిగజారిపోయారో ఆలోచించుకోవాలి.

- కాకుమాను సుధాకర్‌, ఆయన భార్య ఎనిమిదేళ్ల క్రితం చెన్నై వెళ్లిపోయారు. అక్కడ డ్రగ్స్‌ రాకెట్‌తో చేతులు కలిపి డ్రగ్స్‌ సరఫరా కార్యక్రమాలు చేస్తున్నాడని ఇంటెలిజెన్స్‌ ఏజెన్సీలు తెలియచేస్తున్నాయి. సుధాకర్‌ చెన్నైవెళ్లి ఎనిమిదేళ్లు అయింది. అతని భార్య తల్లిదండ్రులు, అంటే ఆయన అత్తామామలు సత్యనారాయణపురంలో నివాసం ఉంటున్నారు.

ఆ ఇంటి పేరు మీదే ఆర్ సీ ట్రేడింగ్‌ కంపెనీని రిజిస్ట్రర్‌ చేశారు. విజయవాడ ఇంటి పేరుమీద కేవలం తప్పుడు అడ్రసుతో నిఘా సంస్థలను పక్కదారి పట్టించడానికి కంపెనీని ఇక్కడ రిజిస్ట్రర్‌ చేయించి, వాటికి సంబంధించిన కార్యకలాపాలు అన్నీ చెన్నై నుంచి ఆపరేట్‌ చేస్తున్నాడని నిఘా వర్గాలు చెప్పడం జరిగింది.
 
2- ఆంధ్రప్రదేశ్ లో ఒక చిరునామా ఉన్న వ్యక్తి ఎక్కడో కన్సైన్ మెంటు బుక్ చేశాడని వార్త వచ్చింది. దాని మీద దర్యాప్తు జరుగుతుంది. కన్సైన్ మెంటులో డ్రగ్స్ ఆంధ్రప్రదేశ్ కి రాలేదు. అవి మన సరిహద్దుల్లో అడుగు కూడా పెట్టలేదు. అయినా, రాష్ట్రం పరువుని బజారుకి ఈడ్చాలనుకుంటున్నారు. 

సుధాకర్‌ స్వస్థలం ద్వారంపూడి అట. ద్వారంపూడి అనగానే.. వైయస్సార్‌ సీపీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర రెడ్డికి డ్రగ్స్‌ మాఫియాతో సంబంధాలు ఉన్నాయంటూ టీడీపీ వారు అసత్య ప్రచారాలు చేస్తున్నారు. ఇంత అన్యాయంగా, ఘోరంగా మాట్లాడటం తెలుగుదేశం పార్టీ వాళ్లకు అలవాటుగా మారిపోయింది. 

ఈనాడులో హెడ్డింగ్‌ చూస్తే ‘సుధాకర్‌ పాత్రధారి... ఢిల్లీ వ్యక్తి కీలక సూత్రధారి’ అంటూ ఢిల్లీలో ఉన్న ఒక డ్రగ్స్‌ మాఫియా కింగ్‌పిన్‌ సూత్రధారి అని సెంట్రల్‌ ఏజెన్సీస్‌, డీఆర్‌ఐ స్పష్టంగా పేర్కొంటున్నాయి. దీనిమీద ఇన్వెస్టిగేషన్‌ జరుగుతోంది. విచారణ జరగకముందే... "ఈ రాష్ట్రంలోకి డ్రగ్స్‌ వచ్చేశాయని,  జగన్‌ రెడ్డి తీసుకు వచ్చేశారంటూ" టీడీపీ నేతలు రాష్ట్ర పరువును బజారుకీడిస్తున్నారు. 
 
3- వాస్తవానికి, తప్పుడు పనులు చేసేవాడు ఎవడైనా నిజమైన ఇంటి అడ్రసు ఇస్తాడా? ఇన్నివేల కోట్లు డ్రగ్స్‌ స్మగ్లింగ్‌ చేసేవాడు సొంత ఇంటి అడ్రస్‌ ఇచ్చే కార్యక్రమం చేస్తాడా? అసలు డ్రగ్స్‌ ఈ రాష్ట్రంలోకి వచ్చాయా? బెజవాడలోకి ఏమైనా వచ్చాయా? అసలు ఈ రాష్ట్ర సరిహద్దుల్లోకి వచ్చాయా?

అవి ఎక్కడో గుజరాత్‌లోని పోర్టులో పట్టుబడి ఢిల్లీ చేరవేసే క్రమంలో పట్టుబడితే.. ఈ రాష్ట్రంలో యువత పాడైపోతున్నారు.  రాష్ట్రంలోకి మాదక ద్రవ్యాలు వచ్చేశాయి.. వైయస్సార్‌ సీపీ  ఎమ్మెల్యేలే ఇవన్నీ చేస్తున్నారని టీడీపీ నేతలు ఇష్టారాజ్యంగా మాట్లాడుతున్నాడు.

- బుద్ధా వెంకన్న, దూళిపాళ్ల నరేంద్ర, బోండా ఉమ, జీవీ ఆంజనేయులు ... వీళ్లంతా సచ్ఛీలురుల్లా, సత్యహరిచంద్రుల్లా ఆరోపణలు చేస్తున్నారు. జీవీ ఆంజనేయులు గురించి మాట్లాడితే టీడీపీ హయాంలో ఫెర్టిలైజర్స్‌ పేరిట వందల కోట్లు సబ్సిడీ పేరుతో దోచుకున్నవ్యక్తి. అయిదు గెస్ట్‌హౌస్‌లు ఉన్న ఆయనకు సాయంత్రం అయితే ఏ గెస్ట్‌హౌస్‌లో ఉంటారో తెలియదు. ఇక బుద్ధా వెంకన్న గురించి చెప్పాల్సిన అవసరం లేదు. కాల్‌ మనీ కేసులో డైరెక్ట్‌గా దొరికిన వ్యక్తి.

విజయవాడలో కాల్‌మనీ వ్యవహారంలో కీలకవ్యక్తి అయిన బుద్ధా వెంకన్న ఇవాళ ప్రభుత్వం మీద విమర్శలు చేస్తున్నాడంటే టీడీపీ పరిస్థితి ఏవిధంగా ఉందో చెప్పుకోవచ్చు. ధూళిపాళ్ల నరేంద్ర ఏకంగా సంగం డైయిరీనే మింగేశారు. ఇక బోండా ఉమ బెజవాడలో ఎన్ని భూములు ఆక్రమించాడో అందరికీ తెలుసు. వీళ్ల మాటలను చూసి ప్రజలు అసహ్యించుకుంటున్నారు.
 
4- మీకు అధికారం లేకపోతే, మీవాడు ముఖ్యమంత్రి కాకపోతే, రాష్ట్రంలో ప్రజలు డ్రగ్స్ వాడుతున్నారని చెప్పే దుర్మార్గానికి ఒడిగడతారా..? ఇది మన దేశం పరువుని, మన రాష్ట్రం పరువుని తియ్యటం కాదా...?.

- ఆంధ్రప్రదేశ్‌లోకి డ్రగ్స్‌ రానివ్వం. వైయస్సార్‌ సీపీ ప్రభుత్వం చాలా కఠినమైన నిర్ణయాలు తీసుకుంటుంది. ఇప్పటికే ఎస్‌ఈబీని ఏర్పాటు చేశాం. ఎక్కడా ఎటువంటి మాదక ద్రవ్యాల కార్యకలాపాలుగానీ‌, కల్తీ సారాగానీ, ఎలాంటి అసాంఘిక సంఘటనలు జరగకుండా కచ్చితంగా చర్యలు తీసుకుంటున్నాం.

8 ఏళ్ళ క్రితం చెన్నైలో సెటిల్ అయిన డ్రగ్స్‌ మాఫియా సూత్రధారి సుధాకర్‌, ఆయన భార్య వైయస్సార్‌ సీపీ అనుచరులని టీడీపీ నేతలు నోటికొచ్చినట్లు మాట్లాడటానికి సిగ్గు ఎక్కడ లేదు. ప్రజలను ఏవిధంగా తప్పుదారి పట్టించాలి, గుడ్డ కాల్చి ఎలా వేయాలి, ప్రభుత్వంపై ఎలా దుమ్మెత్తి పోయాలనేది అనేదే టీడీపీ నాయకుల ఆలోచనగా కనిపిస్తోంది.
 
5- మాదక ద్రవ్యాల గురించి మాట్లాడేటప్పుడు కనీసం ఒక సంస్కారం ఉండాలి. ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డిగారు అమ్మ ఒడి ద్వారా పిల్లలు బాగా చదువుకునేందుకు, వారికి మంచి భవిష్యత్‌ అందించే లక్ష్యంతో పనిచేస్తున్నారు. టీడీపీ నేతలు ఓర్చుకోలేక కడుపు మంటతో ఏవిధంగా తప్పుదోవ పట్టించాలా అని ఇటువంటి తప్పుడు ప్రచారం చేస్తున్నారు.

ఒకవైపు అమ్మ ఒడి ద్వారా పిల్లలకు మంచి భవిష్యత్‌ కోరుకునే ముఖ్యమంత్రి.. ఈ రాష్ట్రంలోకి మాదక ద్రవ్యాలను రానిస్తారా? డ్రగ్స్‌ రాష్ట్రంలోకి  రాకుండానే ముఖ్యమంత్రి జగన్‌ మోహన్‌ రెడ్డిని టార్గెట్‌ చేస్తున్నారు. డీఆర్‌ఐ లాంటి ప్రతిష్టాత్మక సంస్థలు విచారణ జరుపుతుంటే ఈలోపే ఈవిధంగా మాట్లాడటం చాలా నీచమైన సంస్కృతికి తెర లేపుతున్నారు. అధికారం కోల్పోయామనే కడుపు మంటతో అసాంఘిక కార్యక్రమాలు జరుగుతున్నాయని, దౌర్జన్యాలు పెరిగాయని విమర్శలు చేస్తారా?. మీ పప్పులు ఉడకవ్.
 
6-  రాష్ట్రంలో ఫలానా చోట డ్రగ్స్ పట్టుబడ్డాయి అంటే, లేదా ఫలానా వ్యక్తులు డ్రగ్స్ వాడుతున్నారని, అయినా పోలీసులు చర్యలు తీసుకోలేదని మీరు ఆరోపించదలచుకుంటే, అది వేరే విషయం. మీకు అటువంటి అవకాశమే లేదు. మాదక ద్రవ్యాలు గానీ, గంజాయి గానీ, కల్తీ సారాగానీ దొరక్కుండా చేసేందుకు స్పెషల్ ఎన్ ఫోర్స్ మెంటు వ్యవస్థను జగన్ ప్రభుత్వం పెట్టింది. 

కాబట్టి, మాదక ద్రవ్యాలు రాష్ట్రంలో లేవు, వాడటం లేదని తెలిసి కూడా మన రాష్ట్ర ప్రజలు మాదక ద్రవ్యాలు వాడుతున్నారని ఆరోపించడానికి తెగించారంటే... ఇది రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టను దెబ్బతీసే చర్య కాబట్టి, దీనిమీద రాష్ట్ర ప్రభుత్వం తరఫున, రాష్ట్ర పోలీసుల తరఫున కూడా కేసులు నమోదు చేయాలని, ఈ తప్పుడు ప్రచారాలు చేస్తున్న వారిని అరెస్టు చేయాలని వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున డిమాండ్ చేస్తున్నాను. 
 
7- మాదక ద్రవ్యాలు వాడే కల్చర్ ఈ రాష్ట్రంలో ఎవరికి ఉందో, హైదరాబాద్ లో వస్తున్న వార్తలను చూస్తే అందరికీ అర్థమవుతుంది. కానీ, మేం ఆరోపణలు చేయదలచుకోలేదు. ఏపీలో ఆ కల్చర్ లేదని మాత్రమే చెప్పదలచుకున్నాం. 
 
8- ఇదిగో పులి అంటే.. అదిగో తోక.. అని ప్రచారం చేస్తున్నవారు ఎవరి పరువు తీస్తున్నారు. ఈ రాష్ట్రం పరువు తీస్తున్నారు. నిజానికి, చంద్రబాబు నాయుడు ఉగ్రవాదులతో సంబంధాలు కలిగి ఉన్నాడన్నా, నార్కో డాన్ లతో సంబంధాలు కలిగి ఉన్నాడన్నా, చంద్రబాబు నాయుడు ఇంటి పేరు.. నారా చంద్రబాబు నాయుడు కాదు.. నార్కో చంద్రబాబు నాయుడు అని ఆరోపించినా ప్రజలు నమ్ముతారు. కానీ, మేము అంత దిగజారదల్చుకోలేదు. 
 
9-  తెలుగుదేశం పార్టీ అయిదేళ్ల పాలనలో జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల్ని తీసుకుంటే సత్తెనపల్లి నియోజకవర్గంలో అత్యధిక స్థానాలు వైయస్సార్‌ సీపీ గెలిస్తే,  అయిదుగురు ఎంపీటీసీలను కిడ్నాప్‌ చేసి, ఎమ్మెల్యేలను కొట్టి ఎంపీపీ ఎన్నికల్లో అడ్డగోలుగా ఎంపీపీ పదవిని కైవసం చేసుకున్నారు.

ఇలాంటి దౌర్జన్యాలు చేసింది మీరు. ఇవాళ జరుగుతున్న ఎంపీపీ ఎన్నికల్లో ఎక్కడైనా అలాంటి సంఘటనలు ఒక్కటైనా జరిగిందా చూపించండి. ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డిగారు పేదలకు ఇళ్లస్ఠలాలు అమ్మ ఒడి, పెన్షన్లు ఇస్తూ పేదల పాలిట పెన్నిధిగా పరిపాలన చేస్తుంటే మీరు అడ్డగోలుగా నోరు పారేసుకుంటారా?
 
10- అయ‍్యన్నపాత్రుడు మాట్లాడే మాటలు సిగ్గుచేటు. ఎంత నీచంగా మాట్లాడారు. కనీసం నాలుగైదుసార్లు మంత్రిగా పనిచేశారు. అలా మాట్లాడవచ్చా? టీడీపీ నాయకులకు ఒక్కటే చెబుతున్నాం. ఆధారాలు లేకుండా అభియోగాలు చేస్తే ఊరుకునేది లేదు. యువతను తప్పుదోవ పట్టించి రాష్ట్ర ప్రతిష్టను దెబ్బతీస్తే సహించేది లేదు. ఇలాంటివారిపై పోలీసులు చర్యలు తీసుకోవాలి. రాష్ట్ర పరువును మంటగలిపే విధంగా మాట్లాడేవారిపై కేసులు పెట్టి అరెస్ట్‌ చేయాలి అని ప్రభుత్వాన్ని కోరుతున్నాం. 
 
11- ఆధారాలు ఉంటే మాట్లాడండి.. మీ ఆరోపణలకు ఆధారాలు చూపిస్తే వారిపై చర్యలు తీసుకునేందుకు మాకెలాంటి అభ్యంతరం లేదు. రాష్ట్ర ప్రభుత్వానికి, డ్రగ్స్‌ మాఫియాకు ఎలాంటి సంబంధం లేదు. కేవలం తప్పుదోవ పట్టించేందుకే బెజవాడ అడ్రస్‌  ఇచ్చారని నిఘా వర్గాలు పేర్కొంటే... దాన్ని ప్రభుత్వానికి ఆపాదించాలని టీడీపీ చూడటం సరికాదు.

ఎక్కడో గుజరాత్‌లో పట్టుపడిన డ్రగ్స్‌ గురించి టీడీపీ నాయకులు తప్పుడు ఆరోపణలు చేస్తే ఉపేక్షించేది లేదు. రాష్ట్ర ప్రభుత్వం పరువును దెబ్బతీస్తే సహించేది లేదు. వారిపై పోలీసులు కఠిన చర్యలు తీసుకోవాలి.