శుక్రవారం, 24 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By జెఎస్కె
Last Modified: విజయవాడ , శనివారం, 25 సెప్టెంబరు 2021 (18:51 IST)

సెప్టెంబరు 27 భారత్ బంద్...మేం రెడీ అంటున్న‌డాక్టర్ సాకే శైలజానాథ్

బిజెపి ప్రభుత్వ ప్రజావ్యతిరేక విధానాలకు నిరసనగా సెప్టెంబరు 27 న జరిగే భారత్ బంద్ లో వివిధ రాజకీయ పార్టీలు, ప్రజాసంఘాలు పాల్గొని జయప్రదం చేయాలని  ఆంధ్ర ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు డాక్టర్ సాకే శైలజానాథ్ పిలుపునిచ్చారు.  రాష్ట్ర కార్యాలయం నుండి ఒక ప్రకటన చేస్తూ, బిజెపి ప్రభుత్వం రైతాంగ, కార్మిక వ్యతిరేక చట్టాలు తీసువచ్చి ప్రజావ్యతిరేక విధానాలకు పాల్పడుతుందన్నారు. తక్షణమే వ్యవసాయ నల్ల చట్టాలు రద్దు చేయాలని డిమాండ్ చేశారు. మరో పక్క రాష్ట్రంలో విశాఖ ఉక్కు , ప్రభుత్వ రంగ సంస్థలను ప్రైవేటీకరణ చేస్తుందని, తక్షణమే ప్రైవేటీకరణ ను నిలుపుదల చేయడానికి ప్రజలు ఏకం కావాలన్నారు.

దేశ సంపదను కార్పొరేట్ పెట్టుబడిదారులకు ధారాదత్తం చేస్తున్న బిజెపి ప్రభుత్వ విధానాల నుండి దేశాన్ని కాపాడుకోవడానికి ప్రతి ఒక్కరూ పోరాటాలు ద్వారా ముందుకు సాగాలని అన్నారు. మోడీ పాలనలో మహిళలు, గిరిజనులు, దళితులపై దాడులు పెరిగాయి. ప్రశ్నిస్తున్న వారిని అక్రమంగా నిర్బంధిస్తున్నారు. ప్రజావ్యతిరేక విధానాలను తిప్పి కొట్టాలి. ప్రజలందరికీ ఉచిత వ్యాక్సిన్ ఇవ్వాలని, ఆదాయ పన్ను పరిధి వెలుపల ఉన్న కుటుంబాలకు నెలకు రు.7,500 ఇవ్వాలని, పెట్రోలు, డీజిల్, గ్యాస్ ధరలు తగ్గించాలని, వ్యవసాయ చట్టాలను రద్దు చేయాలని, ప్రభుత్వ రంగ ప్రైవేటీకరణ ఆపాలని, కార్మికుల హక్కులకు రక్షణ కల్పించాలని, ఉపాధి హామీ క్రింద 200 పని దినాలు కల్పించాలని తదితర డిమాండ్లతో మోడీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉద్యమించాలని, 3 నల్ల చట్టాలను రద్దు చేయాలని, కార్మిక హక్కులను రక్షించాలని, ప్రభుత్వ రంగాన్ని పరిరక్షించాలని తదితర డిమాండ్లతో ఈ నెల 27వ తేదీన రైతు సంఘాల కార్యాచరణ సమితి ఇచ్చిన దేశవ్యాప్త బంద్ పిలుపును జయప్రదం చేయాలని కోరుతున్నామని ఆంధ్ర ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు డాక్టర్ సాకే శైలజానాథ్ అన్నారు.