డేట్స్ లేకపోయినా అడ్జెస్ట్ చేసుకుని అఖండలో నటించా : సంయుక్తా
అఖండ-2 చిత్ర కథ నచ్చడంతో తనకు డేట్స్ అడ్జెస్ట్ కాకపోయినా వీలు చూసుకుని ఆ చిత్రంలో నటించినట్టు హీరోయిన్ సంయుక్తా మీనన్ అన్నారు. 'భీమ్లా నాయక్', 'బింబిసార', 'సార్', 'విరూపాక్ష' ఇలా విజయవంతమైన చిత్రాల్లో అందం, అభినయంతో తెలుగు ప్రేక్షకులను ఆకట్టుకున్న సంయుక్తా మీనన్... ఇప్పుడు మరో విభిన్న పాత్రతో అలరించేందుకు సిద్ధమైంది. బాలకృష్ణ సరసన సంయుక్త నటించిన 'అఖండ 2' శుక్రవారం విడుదల కానుంది. ఈ సందర్భంగా విలేకరులతో ఆమె పంచుకున్న పలు విశేషాలివీ..
'బింబిసార, విరూపాక్ష, సార్, భీమ్లా నాయక్' ఒకే సమయంలో అంగీకరించినవే. అయినా ఒక్కో సినిమా ఒక్కో సమయంలో విడుదలైంది. 'విరూపాక్ష' తర్వాత తెలుగులో చాలా సినిమా అవకాశాలొచ్చాయి. కానీ, నేను నటనకు ప్రాధాన్యం ఉన్న పాత్రలనే ఎంపిక చేసుకుంటూ వస్తున్నా. అలా నటించినవే.. 'అఖండ 2', 'స్వయంభు', 'నారీ నారీ నడుమ మురారి', 'పూరి జగన్నాథ్ - విజయ్ సేతుపతి మూవీ' నటించాను.
సాధారణంగా ఒక సినిమా ప్రేక్షకులకు నచ్చుతుంది అన్న నమ్మకంతోనే చేస్తాం. విడుదలయ్యాక వారికి నచ్చితే అదే హ్యాపీ. లేకుంటే ఏం చేయలేం కదా. మా టీమ్ నా డేట్స్ ఖాళీగా లేవని చెప్పినా.. 'అఖండ-2' బాగా నచ్చడంతో కాల్షీట్లు సర్దుబాటు చేసుకుని మరీ నటించా. ఈ సినిమా ప్రేక్షకుల ఊహకు మించి ఉంటుంది. ఇందులో నాది స్టైలిష్ రోల్. ఓ సీక్వెన్స్‌లో నా పాత్ర కీలకం.
ఇందులోని 'జాజికాయ జాజికాయ' స్పెషల్ సాంగ్‌కు డ్యాన్స్ చేయాలని తెలియగానే తొలుత ఆందోళన చెందా. నేనెప్పుడూ ఇలాంటి మాస్ సాంగ్‌కు డ్యాన్స్ చేయకపోవడమే కారణం. తర్వాత సవాలుగా తీసుకుని, ప్రాక్టీస్ మొదలుపెట్టా. ఆ క్రమంలో నా మోకాలు సహకరించలేదు. ఫిజియోథెరపీ తీసుకుని, మళ్లీ ప్రారంభించా. ఎట్టకేలకు పూర్తి చేయగలిగా అని సంయుక్తా మీనన్ వెల్లడించారు.
అదేసమయంలో బాలకృష్ణ స్నేహపూర్వకంగా ఉంటారు. ఈ సినిమా కన్నా ముందు ఆయనను ఓ యాడ్ షూటింగ్‌లో కలిశా. అప్పుడే నేనెంతో పరిచయం ఉన్న మనిషిలాగా మాట్లాడారు. దర్శకుడు ఎలా చెబితే అలా నటిస్తారాయన. ఆ లక్షణం బాగా నచ్చింది. బాలయ్యతో సౌకర్యవంతంగా నటించా. ఆయన సినిమాల్లో డాకు మహారాజ్ ఇష్టం. కేరళలోనూ అది విజయవంతమైంది అని ఆమె గుర్తుచేశారు.