టాప్ లేపుతున్న ఎండలు.. తిరుపతిలో 46 డిగ్రీల ఉష్ణోగ్రత
తెలుగు రాష్ట్రాల్లో పగటి ఉష్ణోగ్రతలు రికార్డు స్థాయిలో నమోదవుతున్నాయి. ముఖ్యంగా.. ప్రఖ్యాత ఆధ్యాత్మిక కేంద్రమైన తిరుపతిలో 46 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. రెండు తెలుగు రాష్ట్రాల్లోను ఎక్కడా లేని విధంగా తిరుపతిలో ఈ స్థాయిలో ఉష్ణోగ్రత నమోదైంది. ఎండవేడిమితో తిరుపతి ప్రజలు ఉక్కిరిబిక్కిరి అయిపోతున్నారు. రోడ్లపైకి రావాలంటే బెంబేలెత్తిపోతున్నారు. ఉదయం 11 గంటల తరువాత తిరుపతి రోడ్లన్నీ నిర్మానుషంగా మారిపోతున్నాయి. పాదాచారులెవ్వరూ రోడ్లపై ఒక్కరంటే ఒక్కరు కూడా కనిపించడం లేదు. ఇంటి నుంచి కాలు బయటకు పెట్టాలంటే భయబ్రాంతులకు గురవుతున్నారు. ఎండ వేడిమితో పాటు వేడి గాలి ఎక్కువగా వీస్తుండటంతో పట్టణ వాసులు ప్రాణభయంతో బయటకు వచ్చేందుకు జంకుతున్నారు.
మరోవైపు శ్రీవారి భక్తుల సమస్యలు వర్ణనాతీతంగా ఉంది. బస్టాండ్, రైల్వేస్టేషన్‌లకు చేరుకునే భక్తులు తిరుమలకు వెళ్ళాంటే ఎండలోనే వెళ్ళాల్సిన పరిస్థితి. మొత్తం తారురోడ్లు ఎక్కువగా ఉండడంతో వేడి నేరుగా ముఖానికి తగులుతోంది. దీంతో కొంతమంది భక్తులు కర్చీఫ్, టవళ్ళను ముఖానికి కప్పుకుని తిరుగుతున్నారు. తిరుమలలో కూడా అదేపరిస్థితి. ఏ కాలంలోనైనా చల్లగా ఉండే తిరుమలలో ఎండవేడిమి ఎక్కువగా కనిపిస్తోంది. దీంతో భక్తులు ఎండవేడిమికి తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. తిరుమల తిరుపతి దేవస్థానం ఏర్పాటు చేయాల్సిన చలివేంద్రాలను కొంతమంది ప్రైవేట్ వ్యక్తులు అక్కడక్కడా ఏర్పాటు చేశారు. తితిదే మాత్రం తిరుచానూరు ఆలయం ముందు చలువ పందిళ్ళు వేసింది గానీ మిగిలిన ఎక్కడా వేసిన పాపాన పోలేదు.