గురువారం, 19 ఫిబ్రవరి 2026
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఠాగూర్
Last Updated : ఆదివారం, 18 జనవరి 2026 (10:52 IST)

సత్యనారాయణ వ్రతం చేయించుకుని ఇంటికి తిరిగి వస్తూ అనంతలోకాలకు చేరిన వధువు..

deadbody
అన్నవరం సత్యనారాయణ స్వామి ఆలయంలో సత్యనారాయణ వ్రతం చేయించుకుని తిరిగి ఇంటికి వెళుతుండగా ఓ నవ వధువు అనంతలోకాలకు చేరుకుంది. ఎన్.ఏ.డి వంతెన వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో వధువు ప్రాణాలు కోల్పోగా, ఆమె భర్త గాయాలపాలై ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. పోలీసులు వెల్లడించిన వివరాల మేరకు.. ఎంవీపీ కాలనీ దరి ఎస్‌బీఐ కాలనీ చెందిన మువ్వ రమా హిమజ(27) బీఫార్మసీ చదివింది. గతేడాది అక్టోబరులో మధురవాడకు చెందిన ఎం.వి.వి.వినీష్‌ అనే వ్యక్తితో వివాహమైంది. 
 
వినీష్‌ హైదరాబాద్‌లోని ఓ సాఫ్ట్‌వేర్‌ కంపెనీలో పనిచేస్తున్నాడు. భార్యాభర్తలిద్దరూ ప్రస్తుతం హైదరాబాద్‌లో ఉంటున్నారు. సంక్రాంతి సందర్భంగా ఈనెల 14న ఇద్దరూ నగరానికి వచ్చారు. ఈనెల 16న ఉదయం కారులో అన్నవరం వెళ్లి సత్యనారాయణ స్వామి వ్రతం చేయించుకొని తిరిగి ఇంటికి వస్తున్న క్రమంలో శుక్రవారం రాత్రి 12 గంటల సమయంలో ఎన్‌ఏడీ వంతెనపైకి రాగానే ఒక్కసారిగా కారు టైర్‌ పంక్చర్‌ అయింది. 
 
దీంతో ఒక్కసారిగా కారు అదుపు తప్పి వంతెనపై ఉన్న రోటరీ డివైడర్‌ను ఢీకొట్టింది. హిమజ తలకు గాయం కావడంతో వెంటనే 108లో చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తీసుకెళ్లారు. చికిత్స పొందుతూ శనివారం తెల్లవారుజామున మృతి చెందారు. కుటుంబ సభ్యులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఎయిర్‌పోర్టు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. కుమార్తె హిమజ, అల్లుడిని సంక్రాంతికి ఇంటికి పిలిపించి వారికి ఆతిథ్యం అందజేసి ఆనందంగా గడిపారు. ఇంతలోనే కుమార్తె మృతి చెందడంతో కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు.