దూబె చివర్లో ఆ 2 బౌండరీలు కొట్టకపోతే సంజూ శాంసన్ 97 పరుగులు వృధానేగా
ఐసీసీ టీ20 ప్రపంచ కప్ పోటీల్లో వెస్టిండీస్ జట్టుపై సంజూ శాంసన్ 97 అద్భుత పరుగులు చేయడం వల్లనే భారత జట్టు సెమీ ఫైనల్లోకి ప్రవేశించిందని చాలామంది ప్రశంసలు కురిపిస్తున్నారు. ఐతే టీమిండియా కోచ్ గౌతమ్ గంభీర్ మాత్రం కాస్తంత భిన్నంగా స్పందించారు. విజయం అనేది కేవలం భారీ స్కోరు చేసినవారికి మాత్రమే చెందదనీ, జట్టులో వున్న 11 ఆటగాళ్ల అందరి కష్టం కూడా నిండి వుంటుందన్నారు. జట్టు ప్రయోజనాల కోసం ఆడే ప్రతి ఆటగాడి కష్టానికి విలువ వుంటుందనీ, వ్యక్తిగత రికార్డుల కంటే జట్టు విజయం కోసం చేసే పోరాటమే క్రికెట్ అసలైన అర్థమంటూ వివరించారు.
చూడండి.. వెస్టిండీస్ జట్టుపై విజయం సాధించడానికి చివరి ఓవర్లో 7 పరుగులు అవసరమైనప్పుడు శివమ్ దూబే 2 బౌండరీలు కొట్టడంతో విజయం వరించింది. జట్టు విజయం సాధించింది కనుకనే సంజూ శాంసన్ 97 పరుగులు గురించి మాట్లాడుకుంటున్నారు. అదే పరాజయం పాలైతే ఏమీ మాట్లాడరంటూ వెల్లడించారు. ఐతే గౌతం గంభీర్ వ్యాఖ్యలు సంజూ శాంసన్ పైనేననీ, మొదట్నుంచి అతడంటే గంభీర్‌కు కిట్టదంటూ పలువురు వ్యాఖ్యానిస్తున్నారు.