గచ్చిబౌలిలోని ఓ హోటల్‌లో వ్యభిచారం.. బట్టబయలు చేసిన పోలీసులు
హైదరాబాద్ నగరం గచ్చిబౌలిలోని ఓ హోటల్‌లో గుట్టుచప్పుడుకాకుండా సాగుతూ వచ్చిన వ్యభిచారం గుట్టును పోలీసులు బహిర్గతం చేశారు. పోలీసులకు అందిన విశ్వసనీయ సమాచారంతో హోటల్‌లో తనిఖీలు చేసి ఒక నిర్వాహకుడు, విటుడితో పాటు ముగ్గురు ఉజ్బెక్ యువతులను అరెస్టు చేశారు.
పోలీసులు వెల్లడించిన వివరాల మేరకు.. ఢిల్లీకి చెందిన నిఖిల్ ప్రధాన నిర్వాహకుడిగా వ్యవహరిస్తూ రామ్మోహన్ రెడ్డి అనే వ్యక్తితో కలిసి ఈ అసాంఘిక కార్యకలాపాలను నిర్వహిస్తున్నాడు. పక్కా సమాచారంతో పోలీసులు హోటల్‌పై మెరుపుదాడి నిర్వహించి నిర్వాహకులు నిఖిల్, రామ్మోహన్ రెడ్డితో పాటు విటుడు హర్షిత్ సింఘానియాను రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. ఉజ్బెకిస్థాన్‌కు చెందిన ముగ్గురు యువతులను కూడా అదుపులోకి తీసుకున్నారు.
ఘటనా స్థలం నుంచి పోలీసులు రూ.13 వేల నగదు, రెండు మొబైల్ ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. విచారణలో పట్టుబడిన యువతుల పాస్‌పోర్టులు, వీసాలు చెల్లుబాటులోనే ఉన్నాయని, వారు కొద్ది రోజుల క్రితమే నగరానికి వచ్చినట్టు తేలింది. ఈ ఘటనపై గచ్చిబౌలి పోలీసులు కేసు నమోదు చేసి, ఈ ముఠా వెనుక ఇంకా ఎవరైనా ఉన్నారా అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నారు.

