శ్రీశైలంలో, లక్ష్మీపూజ పేరుతో లైంగిక వేధింపులు.. వీడియోలతో బ్లాక్మెయిల్.. పూజారి అరెస్ట్
crime
ఐఏఎన్ఎస్ నివేదిక ప్రకారం, నిందితుడిని కమ్మర కృష్ణమాచారిగా గుర్తించారు. ఇతను ఆంధ్రప్రదేశ్‌లోని అనంతపురం జిల్లా, అకాటోటపల్లిలో ఉన్న మహకాళి ఆలయంలో పూజారిగా పనిచేస్తున్నట్లు సమాచారం.
బళ్లారి ఏపీఎంసీ పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ వ్యవహారం వెలుగులోకి వచ్చింది. ఇక్కడ అతను బలహీన వర్గాలకు చెందిన కుటుంబాలను లక్ష్యంగా చేసుకుని ఒక ముఠాను నడుపుతున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. సంపదను ఆశ చూపి కుటుంబాలను ఈ పూజారి నమ్మించాడు.
నిందితుడు ఆర్థికంగా, సామాజికంగా వెనుకబడిన కుటుంబాలను లక్ష్యంగా చేసుకున్నాడు. ప్రత్యేక లక్ష్మీ పూజలు చేస్తే భారీగా ధనలాభం కలుగుతుందని వారికి నమ్మబలికాడు. శరీరంపై మచ్చలు లేదా గుర్తులు లేని అవివాహిత యువతులు, బాలికలతో ఈ పూజలు చేయిస్తే సంపద, ఐశ్వర్యం లభిస్తాయని అతను నమ్మించినట్లు తెలిసింది.
సుమారు 5 అడుగుల 6 అంగుళాల ఎత్తు ఉన్న అవివాహిత యువతుల కోసం ఈ ముఠా ప్రత్యేకంగా వెతికేదని దర్యాప్తు అధికారులు తెలిపారు. ఈ ప్రక్రియలో భాగంగా, సదరు యువతుల కుడి చేతులు, కుడి కాళ్ల ఫోటోలను విడివిడిగా పంపాలని కుటుంబాలను కోరేవారని సమాచారం.
నిందితుడు కొంతమంది ఏజెంట్లతో కలిసి పనిచేసేవాడు. వీరు చదువుకోని, ఆర్థికంగా బలహీనంగా ఉన్న కుటుంబాలను గుర్తించి, వారికి పెద్ద మొత్తంలో డబ్బు ఇస్తామని, ఆర్థిక పరిస్థితిని మెరుగుపరుస్తామని ఆశ చూపి దగ్గరయ్యేవారు.
పూజల పేరుతో నిందితుడు యువతులను, బాలికలను లైంగికంగా వేధించేవాడు. బాధితుల నగ్న వీడియోలను, ఫోటోలను రికార్డ్ చేసి, వాటిని ఉపయోగించి వారిని బెదిరించేవాడు.
ప్రాథమిక విచారణలో, ఈ ముఠా 15 మందికి పైగా యువతులు, బాలికలను వేధించినట్లు తేలింది. తమ అభ్యంతరకర వీడియోలు, ఫోటోలను ఇంటర్నెట్లో పెడతామని నిందితులు బాధితులను భయపెట్టేవారు.
కొంతమంది బాధితులను బెంగళూరు, అనంతపురం, విజయపుర వంటి ప్రాంతాల్లో వ్యభిచార కూపంలోకి నెట్టారని పోలీసుల దర్యాప్తులో వెల్లడైంది. నిందితుడిని, అతని ముఠాను పట్టుకోవడానికి పోలీసులు, అక్కా ఫోర్స్‌కు చెందిన మహిళా సిబ్బందితో కలిసి దాదాపు రెండు నెలల పాటు రహస్య ఆపరేషన్ నిర్వహించారు.
ముఠా నమ్మకాన్ని సంపాదించి, వారి కార్యకలాపాల గురించి సమాచారం సేకరించేందుకు మహిళా సిబ్బంది సాధారణ వ్యక్తులుగా నటించినట్లు సమాచారం. చివరికి నిందితుడిని మంగళవారం ఆంధ్రప్రదేశ్‌లోని శ్రీశైలంలో గుర్తించి అరెస్టు చేశారు. ఈ కేసులో పోలీసులు ఇప్పటికే 15 మందిని అరెస్టు చేశారు.
ఇంకా అక్రమ రవాణా నెట్వర్క్, ఇతర సభ్యుల ప్రమేయం, దోపిడీపై పోలీసులు దర్యాప్తు జరుపుతున్నారు. అశ్లీల వీడియోల రికార్డింగ్, బ్లాక్మెయిల్, బాధితుల అక్రమ రవాణాకు సంబంధించిన ఆధారాలను సేకరించేందుకు తదుపరి దర్యాప్తు కొనసాగుతోంది.

