యాత్రను విజయవంతంగా ముగించుకుని భూమికి తిరిగివస్తున్న ఆర్టెమిస్-2
అమెరికా అంతరిక్ష పరిశోధనా సంస్థ నాసా చంద్రుడిపైకి పంపిన ఆర్టెమిస్-2 తన యాత్రను విజయవంతంగా పూర్తి చేసుకుని భూమికి చేరనుంది. ఈ మానవ అంతరిక్ష యాత్రలో నాసా చరిత్రాత్మక మైలురాయిని అందుకుంది. చంద్రుడి వద్దకు పంపిన ఆర్టెమిస్-2 మిషన్ విజయవంతంగా తన యాత్రను ముగించుకుని భూమికి తిరుగు ప్రయాణమైందని నాసా ప్రకటించింది.
ఈ నెల ఒకటో తేదీన నింగిలోకి దూసుకెళ్లిన ఈ స్పేస్ క్రాఫ్ట్, చంద్రుడి చుట్టూ చక్కర్లు కొట్టి ప్రస్తుతం భూమి వైపు వస్తోంది. ఏప్రిల్ 10న రాత్రి 8:07 గంటలకు (అమెరికా కాలమానం ప్రకారం) పసిఫిక్ మహాసముద్రంలో స్ప్లాష్ డౌన్ అవుతుందని అంచనా వేస్తున్నారు. సుమారు 50 ఏళ్ల తర్వాత మానవులను లోతైన అంతరిక్షంలోకి తీసుకెళ్లిన ఈ యాత్ర ప్రపంచవ్యాప్తంగా అందరి దృష్టిని ఆకర్షించింది.
ఈ మిషన్‌లోభాగంగా, నలుగురు వ్యోమగాములు, రీడ్ వైజ్మన్, విక్టర్ గ్లోవర్, క్రిస్టినా కోచ్, జెరెమీ హాన్సెన్, భూమి నుంచి 2,48,655 మైళ్ల దూరం ప్రయాణించి సరికొత్త రికార్డు సృష్టించారు. గతంలో అపోలో-13 మిషన్ నెలకొల్పిన రికార్డును ఇది అధిగమించింది. యాత్రలో అత్యంత దూరపు పాయింట్‌కు చేరినప్పుడు భూమికి, స్పేస్ క్రాఫ్ట్‌కు మధ్య దూరం 2,52,756 మైళ్లుగా నమోదైంది.
