పెళ్లి వేడుకలో అగ్ని ప్రమాదం... 22 మంది సజీవదహనం
కాంగో రాజధాని కిన్షాసాలో ఘోర అగ్నిప్రమాదం సంభవించింది. ఓ పెళ్లి వేడుకలో జరిగిన ఈ ప్రమాదంలో 22 మంది అగ్నికి ఆహుతయ్యారు. మరికొందరు గాయపడ్డారు. దీంతో మృతుల సంఖ్య మరింతగా పెరిగే అవకాశం ఉంది. అయితే, ఈ ప్రమాదానికి గల కారణాలు మాత్రం ఇంకా తెలియరాలేదు. ఈ వివరాలను పరిశీలిస్తే,
డెమొక్రటిక్ రిపబ్లిక్ ఆఫ్ కాంగో రాజధాని కిన్షాసా ఉత్తర ప్రాంతంలోని లింగ్వాలాలో ఉన్న ఒక భవనంలో శుక్రవారం రాత్రి ఆలస్యంగా ఈ ప్రమాదం జరిగింది. శనివారం తెల్లవారుజాము వరకు మంటలు ఎగిసిపడుతూనే ఉన్నాయి.
వేడుక జరుగుతున్న భవనంలో ప్రవేశ ద్వారాలు ఇరుకుగా ఉండటంతో మంటలు వేగంగా వ్యాపించడంతో లోపల ఉన్నవారు బయకు రాలేకపోయారు. ప్రమాదం తర్వాత మృతదేహాలు, గాయపడిన వారు రోడ్డుపక్కన పడివుండగా, ప్రాణాలతో బయటపడిన వారిని స్థానికులు కాపాడే ప్రయత్నం చేశారు.
అయితే, ఈ ప్రమాదానికి కారణాలు తెలియాల్సివుంది. కిన్షాసాలోని జనసాంద్రత అధికంగా ఉండే ప్రాంతంలో సరైన అగ్నిమాపక మౌలిక సదుపాయాలు లేకపోవడంతో ఇలాంటి ప్రమాదాలు తరచుగా జరుగుతున్నాయి. ముఖ్యంగా, వేసవికాలంలో ఈ నగరంలో అగ్నిప్రమాదాలు ఎక్కువగా నమోదవుతున్నాయని స్థానిక మీడియా పేర్కొంది.
