జైలులోనే అంధుడుగా మారుతున్న పాక్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్, చివరికి ఏమవుతారో?
పాకిస్తాన్ దేశంలో జరిగే రాజకీయ పరిణామాలు గురించి వేరే చెప్పక్కర్లేదు. అధికారంలో వున్నప్పుడు ఒక్కొక్కరు చెలరేగిపోతుంటారు. దిగిపోయాక గద్దెనెక్కినవారు అంతకుముందటి నాయకలపై కసి తీర్చుకుంటారు. ఇప్పుడు అదే పాకిస్తాన్ మాజీ ప్రధానమంత్రి ఇమ్రాన్ ఖాన్ వ్యవహారంలోనూ జరుగుతోందని ప్రచారం జరుగుతోంది. ప్రస్తుతం ఆడియాలో జైల్లో వున్న ఇమ్రాన్ ఆరోగ్య పరిస్థితి ఆందోళన కలిగిస్తున్నట్లు వుందని చెప్పుకుంటున్నారు.
ఇమ్రాన్ కంటిచూపు క్రమంగా సన్నగిల్లుతోందట. కుడి కంటి చూపు దాదాపు 85 శాతం పోయిందనీ, కేవలం 15 శాతం మాత్రమే మిగిలి వున్నట్లు వైద్య నివేదికలు చెబుతున్నట్లు కోర్టు నియమించిన న్యాయవాది వెల్లడించారు. ఐతే జైలు అధికారులు ఇమ్రాన్ పట్ల అమానుషంగా ప్రవర్తిస్తున్నారనీ, అందువల్లనే ఆయన ఆరోగ్యం రోజురోజుకీ క్షీణిస్తూ పోతోందని ఇమ్రాన్ మద్దతుదారులు ఆరోపిస్తున్నారు.
తమ తండ్రి ఇమ్రాన్ ఖాన్‌ను ఇకపై ప్రాణాలతో చూడలేమేమో అని ఆయన కుమారులు కొద్ది రోజుల క్రితం ఆవేదన వ్యక్తం చేశారు. తమ తండ్రిని జైలులో నిర్బంధ గదిలో వుంచి మానసికంగా చిత్రహింసలకు గురి చేస్తున్నారని వారు ఆరోపించారు. ఇటీవలే ఇమ్రాన్ కుమారులైన ఖాసీం, సులేమాన్‌లు ఓ వార్తా సంస్థకు ఇంటర్వ్యూ ఇచ్చారు.
మా తండ్రిని రెండేళ్లకు పైగా నిర్బంధ గదిలో ఉంచారు. మురుగు నీరు ఇస్తున్నారు. హెపటైటిస్‌తో చనిపోతున్న ఖైదీల మధ్య ఆయన ఉన్నారు. అక్కడి పరిస్థితులు చాలా దారుణంగా ఉన్నాయి. ఎవరితో మాట్లాడే అవకాశం ఇవ్వకుండా ఏకాంతంగా ఉంచారు. ఆయన్ను బయటకు తీసుకొచ్చేందుకు ఏ మార్గం కన్పించడం లేదు. అయినా మా నమ్మకం ఇంకా అలానే ఉంది. ప్రస్తుతం పరిస్థితులు మరింత దిగజారుతున్నాయి. ఆయన్ను మళ్లీ ఎప్పటికీ చూడలేమేమో అని ఆందోళన చెందుతున్నాం అని అన్నారు.
రోజులో ఎక్కువసేపు తన తండ్రి నిర్బంధ గదిలోనే గడుపుతున్నారని ఆరోపించారు. ఇమ్రాన్ ఇప్పుడు పూర్తిగా ఒంటరిగా ఉన్నారని ఇటీవల సైనికాధికారులు ప్రకటించినట్లు చెప్పారు. అంతర్జాతీయ చట్టాలకు వ్యతిరేకంగా ఆయన జైలు జీవితం ఉందన్నారు. ఇదిలాఉండగా ఇమ్రాన్ జైలులోనే మృతి చెందారంటూ ఆమధ్య పెద్దఎత్తున ప్రచారం జరిగిన సంగతి తెలిసిందే