బుధవారం, 26 నవంబరు 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. అంతర్జాతీయ వార్తలు
Written By ఠాగూర్
Last Updated : బుధవారం, 26 నవంబరు 2025 (16:53 IST)

జైలులో ఇమ్రాన్ ఖాన్ మృతి? పాకిస్తాన్‌లో పుకార్లు

imran khan
క్రికెట్ దిగ్గజం, పాకిస్థాన్ మాజీ ప్రధానమంత్రి ఇమ్రాన్ ఖాన్ ప్రస్తుతం విచారణ ఖైదీగా ఉంటున్నారు. ఆయన జైలులో మరణించినట్టు పుకార్లు వ్యాపించాయి. ఇవి పాకిస్తాన్‌లో ఇమ్రాన్ అభిమానులను ఆందోళనకు గురిచేస్తున్నాయి. దీంతో జైల్లో ఉన్న తమ నేతను చూపించాలంటూ ఆయన మద్దతుదారులు పెద్ద ఎత్తున ఆందోళనలు చేపట్టినట్లు సమాచారం. 
 
కుటుంబ సభ్యులు సైతం ఆయన్ని కలవడానికి అనుమతి ఇవ్వాలని డిమాండ్‌ చేస్తున్నట్లు తెలుస్తోంది. ఈ మేరకు మంగళవారం రాత్రి పెద్ద ఎత్తున నిరసనలు కూడా చేపట్టినట్లు సోషల్‌ మీడియాలో జోరుగా ప్రచారం జరుగుతోంది. వాటికి సంబంధించినవిగా చెబుతున్న ఫొటోలు, వీడియోలు కూడా వైరల్‌ అవుతున్నాయి. దీనంతటికీ కారణం ఇమ్రాన్‌ ఖాన్‌ జైల్లో మృతిచెందారనే వార్తలు బయటకురావడమే.
 
ఇమ్రాన్‌ ఖాన్‌ 2023 ఆగస్టు నుంచి అడియాలా జైలులో ఉన్న విషయం తెలిసిందే. అయితే, ఆయన్ని హతమార్చినట్లు సోషల్‌ మీడియాలో ఒక్కసారిగా వార్తలు తెరపైకి వచ్చాయి. బలూచిస్థాన్‌ విదేశాంగ శాఖ తమ ‘ఎక్స్‌’ ఖాతాలో దీనికి సంబంధించిన పోస్ట్‌ చేసింది. 
 
పాక్‌ చీఫ్‌ ఆఫ్‌ ఆర్మీ స్టాఫ్‌ అసీమ్‌ మునీర్‌, నిఘా విభాగం ఐఎస్‌ఐ కలిసి ఆయన్ని హతమార్చినట్లు వార్తలు వస్తున్నాయని రాసుకొచ్చింది. అలాగే పలు మీడియా సంస్థలు కూడా దీనికి సంబంధించి వార్తలను ప్రచురించినట్లు సామాజిక మాధ్యమాల్లో పలువురు పోస్ట్‌ చేశారు. మరోవైపు ఆయన అనారోగ్యంతోనూ మరణించి ఉండొచ్చనే వాదనలు వినిపిస్తున్నాయి. కానీ, ఇప్పటి వరకు వీటిని ధ్రువీకరించేలా అధికారికంగా ఒక్క ఆధారమూ బయటకు రాలేదు.
 
ఈ వార్తల నేపథ్యంలో ఇమ్రాన్‌ సోదరీమణులు మంగళవారం రాత్రి జైలు దగ్గరకు చేరుకున్నట్లు సమాచారం. వెంటనే తమ సోదరుణ్ని కలిసేందుకు అనుమతించాలని డిమాండ్‌ చేసినట్లు పలు మీడియా సంస్థలు పేర్కొన్నాయి. కానీ, పోలీసులు అందుకు అనుమతించలేదని తెలుస్తోంది. పైగా వారిపై తీవ్రంగా దాడి కూడా చేసినట్లు సమాచారం. దీంతో ఇమ్రాన్‌ పార్టీ తెహ్రీక్‌ ఏ ఇన్సాఫ్‌ కార్యకర్తలు పెద్ద ఎత్తున నిరసనలు చేస్తున్నట్లు తెలుస్తోంది.