దేశాన్ని నాశనం చేస్తున్నారు... పాక్ ఆర్మీ చీఫ్‌పై ఇమ్రాన్ ధ్వజం
పాకిస్తాన్ ఆర్మీ ఆసిమ్ మునీర్‌పై ఆ దేశ మాజీ ప్రధానమంత్రి ఇమ్రాన్ ఖాన్ తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. దేశాన్ని అన్ని విధాలుగా నాశనం చేస్తున్నారని ఆయన ఆరోపించారు. సైనిక బలంతో మునీర్ దేశంలోని అన్ని వ్యవస్థలను ధ్వంసం చేస్తున్నారని ఆరోపించారు. పైగా, జైలులో కూడా తనను దారుణంగా చూస్తున్నారని, ఒంటరిగా నిర్బంధించారని అన్నారు. కనీస సదుపాయాలు కూడా కల్పించడం లేదని వాపోయారు. రాజకీయ బాధితులను చేయడం దేశ చరిత్రలో ఎన్నడూ లేదని ఆయన అన్నారు. ఈ మేరకు ఇమ్రాన్ ఖాన్ ఎక్స్ వేదికగా సమర్పించారు.
రాజ్యాంగ విలువలు, చట్టబద్ధ పాలన, న్యాయం, ప్రజాస్వామ్య స్వేచ్ఛగా వర్ధిల్లడమే బలమైన దేశానికి నిదర్శనమని ఆయన పేర్కొన్నారు. కానీ ఆసిమ్ మునీర్ దృష్టిలో మాత్రం సొంత చట్టాన్ని అమలు చేయడం, ప్రజాస్వామ్య వ్యవస్థలను నాశనం చేయడమేనని ఎద్దేవా చేశారు. ప్రజల మద్దతు లేకుండా ఏ దేశం కూడా బలోపేతం కాలేదని గుర్తించాలని అన్నారు. ఆసిమ్ మునీర్ చట్టం పేరుతో అకృత్యాలకు పాల్పడుతూ ప్రజాస్వామ్య పునాదులను బలహీనపరుస్తున్నారని విమర్శించారు.
జైలు నిబంధనల ప్రకారం కనీస వసతులు కల్పించడం లేదని, తన కుమారులతో కూడా కొన్ని నిమిషాలే మాట్లాడనిస్తున్నారని వాపోయారు. రాజకీయ సహచరులతో కూడా భేటీకి అనుమతించడం లేదని ప్రస్తుత పాలకుల తీరుతో సరిహద్దుల్లో పరిస్థితులు దిగజారుతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. ఆఫ్ఘాన్తో ఉద్రిక్త పరిస్థితులు ఆందోళన కలిగిస్తున్నాయని అన్నారు.