స్వదేశీ పరిజ్ఞానంతో తొలి బుల్లెట్ రైలు - గంటకు 280 కిమీ వేగం - 557 మంది ప్రయాణం
భారత్ ఇపుడు అన్ని రంగాల్లో దూసుకెళుతోంది. ముఖ్యంగా, హైస్పీడ్ రైల్వే టెక్నాలజీతో స్వావలంబన దిశగా ముందడుగు వేసింది. ఫలితంగా దేశంలో పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో తొలి బుల్లెట్ రైలును తయారు చేస్తోంది. బెంగుళూరులోని భారత్ ఎర్త్ మూవర్స్ లిమిటెడ్ కేంద్రంలో ఈ హైస్పీడ్ రైలు నిర్మాణం వేగంగా సాగుతోంది. ముంబై - అహ్మదాబాద్ ప్రాంతాల మధ్య తొలి బుల్లెట్ రైలును నడుపనున్న విషయం తెల్సిదే. ఇందుకోసం ప్రత్యేక కారిడార్ నిర్మాణ పనులు శరవేగంగా సాగుతున్నాయి. అలాదే, దేశీయంగా తయారు చేస్తున్న రైలు భారత వాతావరణం, కార్యాచరణ పరిస్థితులకు అనుగుణంగా ఉండనుంది.
ఈ బుల్లెట్ రైలు గరిష్ఠంగా గంటకు 280 కిలోమీటర్ల వేగాన్ని పరీక్షల సమయంలో అందుకోగలదు. సాధారణ కార్యకలాపాల సమయంలో దీని వేగం గంటకు 249 కిలోమీటర్లుగా ఉంటుంది. మొత్తం 202 మీటర్ల పొడవుండే ఈ రైలులో 8 కోచ్‌లు ఉంటాయి. వీటిలో 4 మోటార్ కార్లు, 4 ట్రైలర్ కార్లు ఉంటాయి. ఒకేసారి 557 మంది ప్రయాణీకులు ప్రయాణించే సామర్థ్యం దీనికి ఉంది. ఇందులో దివ్యాంగుల కోసం రెండు ప్రత్యేక సీట్లను కేటాయించారు.
రైలులో ఏడు స్టాండర్డ్ క్లాస్ కోచ్‌లు (3x2 సీటింగ్), ఒక ఎగ్జిక్యూటివ్ క్లాస్ కోచ్ (2x2 సీటింగ్) ఉంటాయి. భవిష్యత్ అవసరాల కోసం రెండు రైళ్లను కలిపి 16 కోచ్‌లుగా రైలుగా నడిపే వెసులుబాటు కూడా ఉంది. ఆపరేషన్స్ కంట్రోల్ సెంటరుతో సమన్వయం కోసం డ్రైవర్ క్యాబిన్‌లో ఇంటెలిజెంట్ ఆన్ బోర్డ్ కంట్రోల్ సిస్టమ్‌ను అమర్చారు.
భారతీయుల శరీర నిర్మాణానికి అనుగుణంగా విశాలమైన సీట్లు, తగినంత లెడ్రూమ్ ప్రయాణికుల సౌకర్యానికి పెద్దపీట వేశారు. ప్లాట్‌ఫామ్‌కు సమాంతరంగా ఉండేలా ఫ్లోరింగ్, కోచ్‌ల మధ్య సులువుగా నడిచేందుకు వీలుగా గ్యాంగ్వే, ప్రతి సీటు వద్ద పెద్ద కిటికీలు, ఆధునిక ఎల్ ఈడీ లైటింగ్, ల్యాప్టాప్, మొబైల్ ఛార్జింగ్ కోసం పవర్ ఔట్ లెట్లు వంటి సౌకర్యాలు కల్పించారు. పెద్ద లగేజీ కోసం ప్రత్యేకంగా ఫ్లోర్-మౌంటెడ్ స్టాండ్స్ కూడా ఉంటాయి. పర్యావరణ పరిరక్షణ కోసం ఆధునిక బయో-డైజెస్టర్ టాయిలెట్లను ఏర్పాటు చేశారు. శబ్దాన్ని తగ్గించేందుకు సౌండ్ ఇన్సులేషన్, నాయిస్-డ్యాంపింగ్ కోటింగ్‌లను ఉపయోగించారు.
ప్రయాణికుల సమాచారం కోసం ఇంగ్లీష్, హిందీ, ప్రాంతీయ భాషల్లో ఎల్సీడీ డిస్‌ప్లేలు ఉంటాయి. హైస్పీడ్ వై-ఫై ద్వారా ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్ అందుబాటులో ఉంటుంది. అత్యవసర పరిస్థితుల్లో సిబ్బందితో మాట్లాడేందుకు ఎమర్జెన్సీ టాక్-బ్యాక్ యూనిట్లను కూడా అమర్చారు.

