బెంగుళూరులో బీజేపీ మహిళా కార్యకర్త దుశ్శాసన పర్వం - పోలీసులే సూత్రధారులు?
కర్నాటక రాష్ట్రంలోని హుబ్లీ నగరంలో ఓ దారుణ ఘటన జరిగింది. భారతీయ జనతా పార్టీకి చెందిన ఓ మహిళా కార్యకర్తకు దుశ్శాసన పర్వం జరిగింది. ఈ ఘటనలో పోలీసులే మహిళను వివస్త్రను చేశారు. ఓటర్ల జాబితా సవరణ విషయంలో తలెత్తిన వివాదమే ఈ ఘటనకు కారణంగా ఉంది. ఇందుకు సంబంధించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అయింది.
తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, హుబ్లీ కేశ్వాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని బీజేపీ కారహ్యకర్త సుజాత హండి నివాసం ఉంటున్నారు. ఓటర్ల జాబితా సవరణ కార్యక్రమంలో భాగంగా ఆమె ఓటర్ల మ్యాపింగ్ చేపట్టారు. దీనిపై ఆగ్రహం వ్యక్తం చేసిన కాంగ్రెస్ కార్పొరేటర్ సువర్ణ కల్లకుంట్ల, సుజాతపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ ఫిర్యాదు ఆధారంగా పోలీసులు సుజాతను అరెస్టు చేసేందుకు వెళ్ళినపుడు ఈ ఘటన జరిగింది.
పురుష పోలీసులు తనపై దాడి చేసి అసభ్య పదజాలంతో దూషిస్తూ వివస్త్రను చేశారని బాధితురాలు ఆరోపిస్తున్నారు. బయటకు వచ్చిన వీడియోలో కూడా ఓ మగ పోలీస్ అధికారి, దుస్తులు లేని స్థితిలో ఉన్నట్టుగా కనిపిస్తున్న సుజాత భుజాన్ని పట్టుకోవడం కనిపిస్తోంది. ఈ ఘటనపై బీజేపీ ఎమ్మెల్యే మహేశ్ తెంగినకాయి తీవ్రంగా స్పందించారు. ఇది మహిళా లోకానికి జరిగిన అవమానమని, ఈ అమానుష చర్యకు పాల్పడిన పోలీసులను వెంటనే సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు.
అయితే, ఈ ఆరోపణలను పోలీసులు తోసిపుచ్చుతున్నారు. సుజాత హండి తనంతట తానే దుస్తులు విప్పుకుందని అంటున్నారు. ఈ ఘటనపై రాష్ట్ర హోం మంత్రి చర్యలు తీసుకోవాలని కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు విజయేంద్ర దృష్టికి ఈ విషయాన్ని తీసుకెళతామని తెలిపారు. అయితే, ఈ ఘటనపై పోలీసుల నుంచి అధికారిక ప్రకటన వెలువడాల్సివుంది.