రామ మందిరం పేరిట రూ.20 కోట్లు లూటీ చేశారు : మల్లికార్జున ఖర్గే
అయోధ్యలో రామమందిర నిర్మాణం పేరిట రూ.20 వేల కోట్ల విలువైన బంగారం, నగదు లూటీ జరిగిందంటూ వార్తలు వస్తున్నాయని కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే ఆరోపించారు. దేవుని పేరిట ధర్మానికి నేతృత్వం వహించిన పెద్దలే దొంగతనం చేయడం దురదృష్టకరమన్నారు.
బెంగళూరులోని దేవనహళ్లిలో బాబా సాహెబ్ అంబేడ్కర్ విగ్రహాన్ని ఆవిష్కరించిన తర్వాత ఆయన మాట్లాడుతూ, అయోధ్యలో భక్తులు ఇచ్చిన విరాళాలను పక్కదారి పట్టించి, దొంగిలించింది దళితులా అని ప్రశ్నించారు. భాజపాకు మద్దతుగా జపం చేస్తున్న వారే రాముని ఆలయంలో లూటీ చేశారని దుయ్యబట్టారు. మనిషి కోసమే ధర్మం పుట్టింది కానీ, ధర్మం కోసం మనిషి కాదన్నారు. కేవలం ధర్మం ఒక్కటే ఎవరినీ ఉద్ధరించదని స్పష్టం చేశారు. అందరూ ఐకమత్యంతో ఉంటూ, ఉత్తమ విద్యాభ్యాసం పొందాలని పిలుపునిచ్చారు.
భారత రాజ్యాంగ నిర్మాత అంబేడ్కర్ సామాన్య వ్యక్తికాదని, దేశంలోని పేదలు, ఆడబిడ్డల నుదుటి రాతను సరికొత్తగా రాసిన మహాపురుషుడని కొనియాడారు. నెహ్రూ, మహాత్ముని మార్గదర్శకత్వంలో మూడేళ్ల పాటు పలు దేశాల రాజ్యాంగాలను అధ్యయనం చేసి, మన రాజ్యాంగాన్ని రచించారని గుర్తు చేశారు. దళితులకు, మహిళలకు ప్రత్యేకంగా రాజకీయ అవకాశాలను కల్పించేందుకు ముందుగా విద్యాభ్యాసం ముఖ్యమని అంబేడ్కర్ ప్రతిపాదించారని తెలిపారు.
పుణె ఒప్పందం చేసుకుని ఉండకపోతే దళితులకు ఓటు హక్కు, ఎన్నికల్లో పోటీ చేసే హక్కు ఉండేది కాదన్నారు. దురదృష్టవశాత్తు కర్ణాటకలో అంబేడ్కర్‌కు లభించవలసిన గౌరవం దక్కడం లేదన్నారు. కులం, సముదాయాల ఆధారంగా రాజకీయాలు చేస్తున్నారని పేర్కొన్నారు. ఉత్తరప్రదేశ్, పంజాబ్, హర్యానా, ఢిల్లీ తదితర రాష్ట్రాల్లో అంబేడ్కర్ పటాన్ని చూపిస్తూ ఓట్లు దండుకుంటున్న పార్టీలు, నేతలు ఆయన ఆదర్శాలను, తత్వాలను పాలించడం లేదని విమర్శించారు. అంబేడ్కర్ చిత్రపటానికి హారాలు వేసి, నినాదాలు వేసినంత మాత్రాన దళితులకు మేలు జరగదని, ఆయన ఆశయాలను అమలులోకి తీసుకురావలసిన అవసరం ఉందని ఖర్గే పేర్కొన్నారు.
