లిఖితపూర్వక హామీతో దీక్షను విరమించిన సోనమ్ వాంగ్‌చుక్
నీట్ ప్రశ్నపత్రాల లీకేజీకి పాల్పడిన వారిపై కఠినమైన చర్యలు తీసుకుంటామని ప్రధానమంత్రి నరేంద్ర మోడీతోపాటు కేంద్ర మంత్రులు హామీ ఇవ్వడంతో ప్రముఖ సామాజిక కార్యకర్త సోనమ్ వాంగ్‌చుక్ తన ఆమరణ నిరాహారదీక్షను విరమించారు. నీట్ ప్రవేశ పరీక్షలో చోటుచేసుకున్న అవకతవకలకు నైతిక బాధ్యత వహిస్తూ కేంద్ర విద్యామంత్రి ధర్మేంద్ర ప్రధాన రాజీనామా చేయాలన్న డిమాండ్‌తో గత 26 రోజులుగా ఆయన దీక్ష చేస్తున్నారు. గురువారం అర్థరాత్రి దాటిన తర్వాత కేంద్రమంత్రులు జేపీ నడ్డా, జితేంద్ర సింగ్ సమక్షంలో దీక్షను ముగించారు. ఈ సందర్భంగా ప్రధాని మోడీ.. సోనమ్‌కు ప్రత్యేక సందేశం పంపారు. ఆయన ఆరోగ్యంగా ఉండాలని ఆకాంక్షించారు.
'వైద్యుల సూచనలు పాటించి సోనమ్‌జీ వేగంగా కోలుకోవాలి. వీలైనంత త్వరగా ఆయన బరువు పెరగాలని కోరుకుంటున్నా. ఆయన ఆరోగ్యంగా ఉండాలని భగవంతుడిని ప్రార్థిస్తున్నా' అని ప్రధాని తన ఎక్స్ పోస్ట్‌లో రాసుకొచ్చారు. దీక్ష విరమించిన అనంతరం సోనమ్ వాంగ్‌చుక్ శుక్రవారం ఉదయం వీడియో విడుదల చేశారు. 'నీట్ పేపర్ లీకేజీ, పరీక్షా విధానంలో జవాబుదారీతనం, పరీక్షల్లో విస్తృత స్థాయి సంస్కరణలపై పార్లమెంట్‌లో చర్చిస్తామని కేంద్రం లిఖితపూర్వక హామీ ఇచ్చింది. శాంతియుతంగా ఆందోళన చేస్తోన్న విద్యార్థులపై ఎలాంటి కేసులు పెట్టబోమని కూడా చెప్పింది. నీట్ పేపర్ లీక్ నేపథ్యంలో మరణించిన విద్యార్థుల కుటుంబాలను ఆదుకుంటామని హామీ ఇచ్చింది. అందుకే దీక్ష విరమిస్తున్నా' అని సోనమ్ తన వీడియోలో పేర్కొన్నారు.
దీనిపై కాక్రోచ్ జనతా పార్టీ వ్యవస్థాపకుడు అభిజీత్ దీప్కే స్పందిస్తూ.. 'సోనమ్‌జీ దీక్ష విరమించడం ఆనందంగా ఉంది. మీ ప్రాణాలను ఫణంగా పెట్టి దేశాన్ని మేల్కొలిపారు. మీ అసాధారణ ధైర్యం, త్యాగానికి కృతజ్ఞతలు సర్' అని తెలిపారు. అయితే, కేంద్రమంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేసేంతవరకు జంతర్ మంతర్ వద్ద తమ ఆందోళన కొనసాగుతుందని దీప్కే స్పష్టం చేశారు.
పేపర్ లీక్ ఘటనలపై మరిన్ని తీవ్ర చర్యలుంటాయని ప్రధాని మోడీ గురువారం అర్థరాత్రి వీడియో విడుదల చేసిన సంగతి తెలిసిందే. దీనిపై కాంగ్రెస్ ఎంపీ, లోక్‌సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ స్పందించారు. 'మోడీజీ.. మన విద్యార్థులు ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తున్నారు. ఇలాంటి వీడియోలతో మీరు వారిని అవమానించకండి. యువతకు క్షమాపణలు చెప్పి.. వారిపై దౌర్జన్యాలకు పాల్పడిన పోలీసులపై కఠిన చర్యలు తీసుకోండి' అని రాహుల్ తన పోస్ట్‌లో రాసుకొచ్చారు.
