సంబంధిత వార్తలు
- తెలంగాణ ప్రభుత్వం రైతులకు శుభవార్త -ఆగస్టు 15 నాటికి రుణమాఫీ ప్రక్రియ
- స్కూలులో దెయ్యం ఉందని భయపడిన విద్యార్థులు... రాత్రంతా ఒంటరిగా స్కూల్లో నిద్రించిన టీచర్..
- ఫాస్ట్ బౌలర్ మహ్మద్ సిరాజ్కు తెలంగాణ సీఎం రేవంతన్న నజరానా!
- కాళ్లు పట్టుకుని ఎవరో తోసేశారు... భవనం పైనుంచి కిందపడిన విద్యార్థిని వాంగ్మూలం
- టీడీపీ ప్రయోజనాలే రహస్య అజెండాగా చంద్రబాబు తెలంగాణ పర్యటన : విజయశాంతి
ఎంతకీ తెరుచుకోని ఏటీఎం యంత్రం... విసిగిపోయి ఎత్తుకెళ్లిన దొంగలు!!
తెలంగాణా రాష్ట్రంలో కొందరు దొంగలు ఏకంగా ఏటీఎం యంత్రాన్ని ఎత్తుకెళ్లారు. ఏటీఎం యంత్రంలోని నగదును చోరీ చేసేందుకు వచ్చారు. అయితే, ఏటీఎం యంత్రాన్ని పగులగొట్టేందుకు ప్రయత్నించగా, అది ఎంతకీ పగలలేదు. దీంతో విసుగు చెందిన దొంగలు ఏకంగా ఆ ఏటీఎం యంత్రాన్ని ఎత్తుకొని వెళ్లిపోయారు. కామారెడ్డి జిల్లా బిచ్‌కంద మండలంలో ఈ ఘటన చోటుచేసుకుంది. తాజాగా వెలుగులోకి వచ్చింది.
పోలీసులు, బ్యాంకు అధికారుల వివరాల ప్రకారం.. మంగళవారం తెల్లవారుజామున సుమారు 3 గంటల ప్రాంతంలో నలుగురు దొంగలు క్వాలిస్ వాహనంలో బిచ్కుందకు వచ్చి ఎస్బీఐ బ్యాంకు పక్కనున్న ఏటీఎంలో చోరీకి యత్నించారు. ఏటీఎం ఎంతకూ తెరుచుకోకపోవడంతో దాన్ని తాళ్లతో తమ వాహనానికి కట్టి లాగారు. అనంతరం గది అద్దాల తలుపును ధ్వంసం చేసి ఏటీఎంను తమ వాహనం వెనుకభాగంలో ఎక్కించుకొని తీసుకెళ్లినట్లు సీసీ పుటేజీలో నిక్షిప్తమైంది.
దొంగిలిస్తున్న సమయంలో సైరన్ మోగడంతో అప్రమత్తమైన బ్యాంకు అధికారులు పోలీసులకు సమాచారం అందించారు. కానీ వారు సంఘటనా స్థలానికి చేరుకొనేలోగా దొంగలు పారిపోయారు. ఏటీఎంలో రూ.3.97 లక్షల నగదు నిల్వ ఉన్నట్లు బ్యాంకు అధికారులు తెలిపారు. మహారాష్ట్ర సరిహద్దులో గుల్ల వద్ద దొంగలు వినియోగించిన క్వాలిస్ కనిపించడంతో పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.
దుండగులు బిచ్కుంద మీదుగా జుక్కల్ చేరుకొని గుల్ల ప్రాంతం వద్ద వాహనాన్ని వదిలేసి మహారాష్ట్రకు పారిపోయినట్లు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. అయితే దుండగులు పారిపోతూ మార్గం మధ్యలో జుక్కల్ మండలం పెద్దపడ్డి గ్రామంలో రెండు ద్విచక్ర వాహనాలను సైతం చోరీ చేశారని జుక్కల్ ఎస్ఐ సత్యనారాయణ తెలిపారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు బాన్సువాడ డీఎస్పీ సత్యనారాయణ, బిచ్కుంద సీఐ నరేష్ తెలిపారు.
