1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ వార్తలు
Written By వరుణ్
Last Updated : మంగళవారం, 9 జులై 2024 (10:15 IST)

టీడీపీ ప్రయోజనాలే రహస్య అజెండాగా చంద్రబాబు తెలంగాణ పర్యటన : విజయశాంతి

vijayashanthi
ఉభయ తెలుగు రాష్ట్రాల సమస్యల పరిష్కారానికి, తెలుగు రాష్ట్రాల ప్రజల ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు హైదరాబాదుకు వచ్చారని అందరూ భావించారు. కానీ, తెలుగు రాష్ట్రాల ప్రజల ప్రయోజనాలకంటే తెలుగుదేశం పార్టీ ప్రయోజనాలే చంద్రబాబు రహస్య అజెండాగా ఉన్నాయేమో అన్న అనుమానం కలుగుతోందని సినీ నటి, భారతీయ జనతా పార్టీ మహిళా నేత విజయశాంతి ఆరోపించారు. 
 
ఇదే అంశంపై ఆమె తన ఎక్స్ ఖాతాలో ఓ ట్వీట్ చేశారు. తెలంగాణాలో మళ్లీ తెలుగుదేశం పార్టీ విస్తరిస్తుందని చంద్రబాబు చేసిన ప్రకటనే ఇందుకు ఉదాహరణ. తెలంగాణాలో తెలుగుదేశం బలపడుతుందని చంద్రబాబు అనడం పలు అనుమానాలకు తావిస్తోందన్నారు. తెలంగాణాలో తెలుగుదేశం ఎప్పటికీ బలపడదు గాని... తెలుగుదేశం పార్టీ తన కూటమి భాగస్వామి అయిన బీజేపీతో కలిసి తెలంగాణలో బలపడనీకి కుట్రలు చెయ్య ప్రయత్నిస్తే టీడీపీతో పాటు బీజేపీ కూడా ఇక్కడ మునిగి గల్లంతయ్యే అవకాశాలు ఉద్యమ తెలంగాణలో తప్పక ఏర్పడి తీరుతాయని ఆమె జోస్యం చెప్పారు. 
 
తిరిగి తెలంగాణవాదులు, ఉద్యమకారులు పోరాట ప్రస్థానానికి కదలటం నిశ్చయమైన భవిష్యత్ వాస్తవం... అంతేకాదు, అసలు తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వ పరిపాలన బాగున్నదని విస్పష్టంగా ప్రకటించిన చంద్రబాబు, తెలంగాణ రాష్ట్రంలో టీడీపీని తిరిగి బలపరుస్తాం అని చెప్పాల్సిన అవసరం ఏముందని ఆమె ప్రశ్నించారు.