బుధవారం, 18 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ వార్తలు
Written By ఠాగూర్
Last Updated : మంగళవారం, 7 మే 2024 (13:11 IST)

మోడీకి లొంగని వ్యక్తుల్లో నేనూ ఒకడిని.. అరెస్టు చేసేందుకు మోడీ కుట్ర : కేసీఆర్

kcrao
ప్రధానమంత్రి నరేంద్ర మోడీకి లొంగి వ్యక్తుల్లో తాను, అరవింద్ కేజ్రీవాల్ ఒకరని, అందుకే తనను అరెస్టు చేసేందుకు ప్రధాని మోడీ శతవిధాలా ప్రయత్నిస్తున్నారని భారత రాష్ట్ర సమితి అధినేత, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ అన్నారు. లోక్‌సభ ఎన్నికల ప్రచారంలో భాగంగా , జగిత్యాలలో జరిగిన ప్రచార సభలో ఆయన పాల్గొని ప్రసంగించారు. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ తనను కూడా జైలుకు పంపేందుకు ప్రయత్నించారని ఆరోపణలు చేశారు. మోడీకి లొంగని వ్యక్తుల్లో తాను, కేజీవాల్, హేమంత్ సోరెన్ ఉన్నామని, వారిద్దరినీ అనుకున్నట్టే జైలుకు పంపినా తనెక్కడా అవినీతికి పాల్పడకపోబట్టే మోడీకి తాను దొరకలేదని చెప్పారు.
 
ఢిల్లీ మద్యం కేసు అనేది మోడీ వికృత రూపానికి నిదర్శనమని దుయ్యబట్టారు. మద్యం పాలసీలో కుంభకోణాన్ని సృష్టించి అందులో కవితను ఇరికించారని ఆరోపించారు. పదేళ్ల తమ పాలనలో అద్భుతాలు చేశామన్న కేసీఆర్ ఐదు నెలల పాలనలోనే ప్రజలు రాచి రంపాన పెడుతోందని మండిపడ్డారు. ఈ ఎన్నికల్లో తప్పకుండా ప్రభావం కనిపిస్తుందని, బీఆర్ఎస్ గణనీయమైన సీట్లు గెలుచుకుంటుందని ఆశాభావం వ్యక్తం చేశారు.
 
లోక్‌సభ ఎన్నికలు తమ పాలనకు రెఫరెండమన్న సీఎం రేవంత్ రెడ్డి తోకముడిచారని ఎద్దేవా చేశారు. రాష్ట్రంలో కాంగ్రెస్, బీజేపీ కుమ్మక్కయ్యాయని, పార్లమెంటు ఎన్నికల తర్వాత రాష్ట్రంలో అనిశ్చితి ఏర్పడబోతోందన్నారు. కేంద్రంలో ఎన్డీయేకు మెజార్టీ వచ్చే పరిస్థితి ఎంతమాత్రమూ లేదన్న కేసీఆర్.. వచ్చేది సంకీర్ణ ప్రభుత్వమేనని స్పష్టం చేశారు. మహారాష్ట్ర, బీహార్, పశ్చిమ బెంగాల్లో బీజేపీ తుడిపెట్టుకు పోతుందన్నారు. దక్షిణాదిలో బీజేపీకి 12 సీట్లు వస్తేనే ఎక్కువని కేసీఆర్ అభిప్రాయపడ్డారు.