1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఐవీఆర్
Last Updated : మంగళవారం, 21 మే 2024 (13:23 IST)

మీడియాలో వాయిస్ లేనోళ్లంతా జగన్‌కే ఓటు, భారీ మెజారిటీ: రాజు రవితేజ

jagan
సీఎం జగన్ మోహన్ రెడ్డి జూన్ 9న విశాఖపట్టణంలో రెండోసారి ముఖ్యమంత్రిగా పదవీప్రమాణం చేస్తారంటూ ఏపీ మంత్రిమండలిలోని మంత్రులందరూ ముక్తకంఠంతో చెబుతున్నారు. ఈ విషయాన్ని తమ అధికారిక ట్విట్టర్ హ్యాండిల్ ద్వారా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తెలియజేసింది. తాజాగా జగన్ రెండోసారి సీఎం అవుతారని జోస్యం చెబుతున్నారు ఒకప్పటి జనసేన పొలిట్ బ్యూరో సభ్యుడు రాజు రవితేజ.
 
ఆయన మాట్లాడుతూ... జగన్ మోహన్ రెడ్డి పేద ప్రజలకు అద్భుతమైన సేవ చేసారు. నగరాల్లోని ప్రజలకు మీడియా వాయిస్ వినిపించేందుకు అవకాశం వుంటుంది. కానీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మీడియాలో వాయిస్ లేనివాళ్లు భారీ సంఖ్యలో వున్నారు. వాళ్లందరూ గంపగుత్తగా వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పార్టీ వైసిపికి ఓట్లు వేసారని చెప్పుకొచ్చారు. పనులు మానేసి అందరూ ఓట్లు వేసినందువల్లనే అంత పెద్ద భారీ క్యూలలో ఓటర్లు బారులు తీరారనీ, వాళ్లంతా వైసిపికి ఓటు వేసారని అన్నారు. వాస్తవానికి వైసిపి గెలిస్తే సమాజం గెలిచినట్లే. పేదల పార్టీ వైసిపి తప్పక గెలుస్తుంది. ఆ పార్టీ గెలవాలని నా హృదయపూర్వకంగా కోరుకుంటున్నా అని అన్నారు.
 
కాగా 2019లో జనసేన పార్టీ పొలిట్‌బ్యూరో సభ్యుడైనటువంటి రాజు రవితేజ ఆ పార్టీకి రాజీనామా చేశారు. జనసేన అధినేత ఓ ప్రమాదకరమైన విభజన శక్తిగా మారారంటూ తీవ్ర ఆరోపణలు గుప్పించారు. అలాంటి వ్యక్తికి రాజకీయ పదవి ఇవ్వకూడదనీ, ప్రజాసేవకు అతడు పనికిరారంటూ విమర్శనాస్త్రాలు సంధించారు. ఐతే రాజు రవితేజ రాజీనామా చేసిన వెంటనే పవన్ కల్యాణ్ వెంటనే ఆమోదించారు. రవితేజకు మంచి భవిష్యత్తు ఉండాలని ఆకాంక్షించారు.