1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఠాగూర్
Last Updated : ఆదివారం, 12 మే 2024 (09:09 IST)

సీఎం జగన్ సభలకు ఆర్టీసీ బస్సులు ఫుల్... సొంతూళ్లకు వెళ్లేవారికి బస్సులు నిల్

passengers crowd
ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి సిద్ధం సభలకు వేల సంఖ్యలో బస్సులు సమకూర్చి స్వామిభక్తి చాటుకున్న ఆర్టీసీ ఎండీ ద్వారకా తిరుమలరావు.. ఓటేసేందుకు సొంతూళ్లకు వచ్చే సామాన్య ప్రజలకు అవసరమైనన్ని బస్సులు ఏర్పాటు చేయకుండా వాళ్లచావు వాళ్లు చావని అనేలా వదిలేశారు. 
 
హైదరాబాద్‌, చెన్నై, బెంగళూరు వంటి నగరాల్లోని ఏపీకి చెందిన వారంతా ఓటేసేందుకు తప్పకుండా సొంతూళ్లకు వస్తారనేది అందరికీ తెలిసిన విషయమే. కానీ డీజీపీ ర్యాంక్‌ అధికారి అయిన ఆర్టీసీ ఎండీకి మాత్రం ఇది ఎందుకు తెలియలేదనేది ఆశ్చర్యం కలిగిస్తోంది. కొద్ది రోజుల కిందటి వరకు సీఎం జగన్‌ నిర్వహించిన ప్రతి 'సిద్ధం' సభకు వెయ్యి నుంచి 3 వేల చొప్పున బస్సులు కేటాయించారు. ఇప్పుడు ఎన్నికల సమయంలో ప్రజలకు మాత్రం సరైన ఏర్పాట్లు చేయలేదు. 
 
ఎన్నికల్లో ఓటేసేందుకు ప్రతి ఒక్కరూ సొంతూళ్లకు ప్రయాణమవుతారని తెలిసినా ఆర్టీసీ అధికారులు పూర్తిస్థాయిలో ప్రత్యేక బస్సులు ఏర్పాటు చేయలేకపోయారు. సోమవారం పోలింగ్‌ జరగనుండగా, శని, ఆదివారాలు వరుసగా సెలవులు వచ్చాయి. దీంతో రద్దీ అధికంగా ఉంటుందనే అంచనా వేయలేకపోయారు. 
 
హైదరాబాద్‌ నుంచి రాష్ట్రంలోని అన్ని జిల్లాలకు రెగ్యులర్‌ సర్వీసులతో పాటు అదనంగా శుక్ర, శనివారాల్లో రోజుకు 300 చొప్పున మాత్రమే ప్రత్యేక బస్సులు ఏర్పాటు చేశారు. శనివారం 205 బస్సులే సిద్ధం చేశారు. దీంతో అవి ఏమాత్రం సరిపోవడంలేదు. హైదరాబాద్‌ నుంచి వేల సంఖ్యలో ప్రయాణికులు ఎలాగోలా రైళ్లు, బస్సుల్లో విజయవాడకు చేరుకున్నా.. అక్కడి నుంచి చుట్టుపక్కల మండలాలు, ఇతర జిల్లాల్లోని సొంత ఊరికి వెళ్లేందుకు బస్సుల్లేక తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు.
 
ఈ నెల 8 నుంచి ఆదివారం వరకు హైదరాబాద్‌ నుంచి రాష్ట్రంలో వివిధ ప్రాంతాలకు 1,048 ప్రత్యేక బస్సులు అందుబాటులో ఉంచామని ఆర్టీసీ పేర్కొంది. వీటన్నింటిలో సాధారణ ఛార్జీలే వసూలు చేస్తున్నట్లు ఎండీ ద్వారకా తిరుమలరావు శనివారం ఓ ప్రకటనలో తెలిపారు. ఎన్నికల్లో ఓటేయడానికి పొరుగు రాష్ట్రాల నుంచి స్వగ్రామాలకు వస్తున్న వారికి ఎలాంటి ఆటంకం కలగకుండా చూడాలని కలెక్టర్లను, ఎస్పీలను రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి (సీఈఓ) ముకేశ్‌కుమార్‌ మీనా ఆదేశించారు.